Yora Tade: ఫైనల్‌ మ్యాచ్‌లో తలపడుతూ మృత్యు ఒడిలోకి భారత కిక్‌ బాక్సర్‌

26 Aug, 2022 18:08 IST|Sakshi

24 ఏళ్ల భారత యువ కిక్‌ బాక్సర్‌ యోరా టేడ్‌ గురువారం రాత్రి(ఆగస్టు 25న) కన్నుమూశాడు. నేషనల్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆదివారం చెన్నైలోని సదరన్‌ సిటీ వేదికగా కేశవ్‌ ముడేల్‌తో ఫైనల్‌ మ్యాచ్‌ జరిగింది. బౌట్‌లో భాగంగా ప్రత్యర్థి ముడేల్‌ ఇచ్చిన పంచ్‌ యోరా తలకు బలంగా తాకింది. దీంతో సృహతప్పిన యోరా రింగ్‌లోనే కుప్పకూలాడు. వెంటనే చెన్నైలోని రాజీవ్‌గాంధీ ఆసుపత్రికి తరలించారు. కానీ దురదృష్టవశాత్తూ రెండు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన యోరా గురువారం కన్నుమూసినట్లు ఆసుపత్రి జనరల్‌ డైరెక్టర్‌ పేర్కొన్నారు.

కాగా అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన యోరా టేడ్‌ ఇండియన్‌ ఎడిషన్‌ అయిన వరల్డ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ కిక్‌బాక్సింగ్‌ ఆర్గనైజేషన్‌ టోర్నమెంట్‌లో తొలిసారి ఫైనల్‌కు అర్హత సాధించాడు. కాగా పోలీసులు టేడా మృతదేహాన్ని అరుణాచల్‌ ప్రదేశ్‌కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా యోరా టేడా మృతిపట్ల అరుణాచల్‌ ప్రదేశ్‌ సీఎం పేమా ఖండూ విచారం వ్యక్తం చేశారు.

''యువ బాక్సర్‌ యోరా టేడా ఇంత తొందరగా మమ్మల్ని విడిచి స్వర్గాన్ని వెళ్లిపోతాడని ఊహించలేదు. కిక్‌ బాక్సింగ్‌లో అతనికి మంచి భవిష్యత్తు ఉందని ఆశించా. కానీ మృత్యువు అతన్ని వెంటాడింది ఇది నిజంగా దురదృష్టం. చెప్పడానికి మాటలు రావడం లేదు.. అతని ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. అతని కుటుంబసభ్యులకు, స్నేహితులకు నా ప్రగాడ సానుభూతి'' అని ట్విటర్‌ వేదికగా పేర్కొన్నారు.

చదవండి: 11 ఏళ్లుగా సింగర్‌తో సహజీవనం, బ్రేకప్‌.. ఇప్పుడు ఇంకో అమ్మాయితో!

 'లైగర్‌' సినిమా ఎమ్‌ఎంఏ ఫైట్‌.. క్రూరమైన క్రీడ నుంచి ఆదరణ దిశగా

మరిన్ని వార్తలు