‘పంచ’ ఖేల్‌రత్నాలు!

19 Aug, 2020 02:57 IST|Sakshi

దేశ అత్యున్నత క్రీడా పురస్కారానికి ఐదుగురి పేర్లు సిఫారసు

అర్జున కోసం 29 పేర్లు ప్రతిపాదించిన కమిటీ

న్యూఢిల్లీ: భారత క్రీడా అవార్డుల చరిత్రలో తొలిసారి ఏకంగా ఐదుగురిని దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్‌ గాంధీ ఖేల్‌రత్న’ కోసం సెలెక్షన్‌ కమిటీ కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు సిఫారసు చేసింది. మేటి క్రికెటర్‌ రోహిత్‌ శర్మ (మహారాష్ట్ర), మహిళా స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ (హరియాణా), టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) ప్లేయర్‌ మనిక బత్రా (ఢిల్లీ), భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్‌ రాణి రాంపాల్‌ (హరియాణా), 2016 రియో పారాలింపిక్స్‌లో హైజంప్‌లో స్వర్ణం నెగ్గిన దివ్యాంగ అథ్లెట్‌ మరియప్పన్‌ తంగవేలు (తమిళనాడు) పేర్లను 12 మంది సభ్యుల సెలెక్షన్‌ కమిటీ ఖరారు చేసింది.

సోమ, మంగళవారాల్లో సమావేశమైన ఈ కమిటీ ‘ఖేల్‌రత్న’తోపాటు ఉత్తమ క్రీడాకారులకు అందించే ‘అర్జున’ అవార్డు కోసం 29 మందిని... కోచ్‌లకు ఇచ్చే ‘ద్రోణాచార్య’ అవార్డు కోసం 13 మందిని... ప్లేయర్‌ ఉన్నపుడు, ఆట నుంచి రిటైరయ్యాకా క్రీడాభివృద్ధికి తోడ్పడుతున్న వారికి అందించే ‘ధ్యాన్‌చంద్‌’ జీవితకాల సాఫల్య అవార్డు కోసం 15 మందిని ఎంపిక చేసి కేంద్ర క్రీడా శాఖకు పంపించింది. ‘అర్జున’ కోసం ఎంపిక చేసిన జాబితాలో భారత సీనియర్‌ క్రికెటర్‌ ఇషాంత్‌ శర్మతోపాటు ఆర్చర్‌ అతాను దాస్, కబడ్డీ ప్లేయర్‌ దీపక్‌ హుడా, టెన్నిస్‌ ప్లేయర్‌ దివిజ్‌ శరణ్‌ తదితరులు ఉన్నారు.  సెలెక్షన్‌ కమిటీ పంపించిన అవార్డుల జాబితాలో మార్పులు చేర్పులు చేసే అధికారం కేంద్ర క్రీడా శాఖకు ఉంటుంది.

కానీ చాలా సందర్భాల్లో సెలెక్షన్‌ కమిటీ పంపించిన జాబితానే కేంద్ర క్రీడా శాఖ ఆమోదించి అవార్డీలను ఖరారు చేస్తుంది. కేంద్ర క్రీడా శాఖ ఆమోదించాకే అధికారికంగా జాతీయ క్రీడా పురస్కారాల జాబితాను ప్రకటిస్తారు. హాకీ దిగ్గజం మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జయంతి, జాతీయ క్రీడా దినోత్సవమైన ఆగస్టు 29న రాష్ట్రపతి భవన్‌లో జరిగే కార్యక్రమంలో క్రీడా అవార్డులను అందజేస్తారు. కరోనా నేపథ్యంలో ఈసారి ఆన్‌లైన్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. రియో ఒలింపిక్స్‌ జరిగిన 2016లో అత్యధికంగా నలుగురికి ఏకకాలంలో ‘ఖేల్‌రత్న’ ఇచ్చారు. ‘రాజీవ్‌ఖేల్‌ రత్న’ అవార్డుకు నామినేట్‌ అయిన ఐదుగురు ఆటగాళ్లకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో వారు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

‘ధ్యాన్‌చంద్‌’ అవార్డు బరిలో ఉష 
జీవితకాల సాఫల్య అవార్డు ‘ధ్యాన్‌చంద్‌’ కోసం కమిటీ పంపించిన జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ మహిళా బాక్సర్‌ నగిశెట్టి ఉష కూడా ఉంది. వైజాగ్‌కు చెందిన 36 ఏళ్ల ఉష 2006 ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో రజతం, 2008 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం... 2008 ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించింది. ఆరు సార్లు సీనియర్‌ నేషనల్‌ చాంపియన్‌గా నిలిచింది. ఆట నుంచి రిటైరయ్యాక ఉష 2013 నుంచి 2017 మధ్యకాలంలో పలువురు మహిళా బాక్సర్లకు శిక్షణ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె విశాఖ లోకో షెడ్‌లో పని చేస్తోంది. అర్జున అవార్డుల కోసం ప్రతిపాదించిన పేర్లలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాత్విక్‌ సాయిరాజ్‌ (బ్యాడ్మింటన్‌) పేరు కూడా ఉంది.

మరిన్ని వార్తలు