అంపైర్ల నియామకానికి రాత పరీక్ష.. పిచ్చి ప్రశ్నలతో విసిగించిన బీసీసీఐ

20 Aug, 2022 13:04 IST|Sakshi

క్రికెట్‌లో అంపైర్ల పాత్ర కీలకమైనది. అది ఫీల్డ్‌ అంపైర్లు కావొచ్చు.. థర్డ్‌ అంపైర్‌ కావొచ్చు. అంపైర్లు తీసుకునే నిర్ణయాలపైనే ఆటగాళ్ల భవితవ్యం ఆధారపడి ఉంది.  అంపైర్‌ నిర్ణయంపై అప్పీల్‌ చేసుకోవడానికి ఇప్పుడంటే డీఆర్‌ఎస్‌ రూపంలో ఒక ఆప్షన్‌ ఉంది. కానీ డీఆర్‌ఎస్‌ లేనప్పుడు అంపైర్‌దే కీలక నిర్ణయం.రనౌట్‌, స్టంపింగ్‌ మినహా మిగతా ఎలాంటి నిర్ణయాలైనా అంపైర్‌ తీర్పు ఫైనల్‌గా ఉంటుంది.

కొన్నిసార్లు ఔట్‌ కాకపోయినప్పటికి.. అంపైర్‌ తప్పుడు నిర్ణయాల వల్ల బ్యాట్స్‌మెన్లు బలైన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఒక్కోసారి అవి ‍మేలుచేస్తే.. కొన్నిసార్లు కీడు చేశాయి. తప్పుడు అంపైరింగ్‌ వల్ల ఆటగాళ్లు ఫీల్డ్‌ అంపైర్లతో గొడవకు కూడా దిగిన సందర్బాలు కోకొల్లలు. డీఆర్‌ఎస్‌ రూల్‌ వచ్చినప్పటికి.. ఇ‍ప్పటికీ ఫీల్డ్‌ అంపైర్లకే సర్వాధికారాలు ఉంటాయి. థర్డ్‌ అంపైర్‌ ఔట్‌ కాదని ప్రకటించినా.. ఒకవేళ​ ఫీల్డ్‌ అంపైర్లు ఔట్‌ ఇస్తే బ్యాటర్‌ వెనుదిరగాల్సిందే. ఇలాంటివి అంతర్జాతీయ క్రికెట్‌ సహా బిగ్‌బాష్‌ లీగ్‌, ఐపీఎల్‌ సహా ఇతర ప్రైవేట్‌ లీగ్స్‌లో చాలానే చోటుచేసుకుంటున్నాయి. 

కాగా క్రికెట్‌లో పెద్దన్న పాత్ర పోషిస్తున్న భారత్‌లోనూ అంపైరింగ్‌ వ్యవస్థ ఎప్పటిలాగే ఉంటుంది. ఇటీవలే ఐపీఎల్‌తో పాటు దేశవాళీ క్రికెట్ టోర్నీల్లో కూడా అంపైర్ల నిర్ణయాలపై తీవ్ర దుమారం రేగుతుండడంతో బీసీసీఐ.. అంపైరింగ్ స్థాయిని పెంచేందుకు చర్చలు తీసుకోవడం మొదలెట్టింది. కొత్త అంపైర్లను తీసుకునే నియామక ప్రక్రియలో అత్యంత కఠినమైన పరీక్షలు నిర్వహించాలని భావించింది. అందుకే గ్రూప్-డి అంపైరింగ్ నియమాకాల కోసం (మహిళలు, జూనియర్ మ్యాచులు) బీసీసీఐ రాత పరీక్ష నిర్వహించింది.

200 మార్కులకు జరిగిన ఈ పరీక్షలో క్వాలిఫికేషన్ మార్కులు 90. 200 మార్కుల్లో.. రాత పరీక్షకు 100 మార్కులు, పర్సనల్ ఇంటర్వ్యూకి 35 మార్కులు, వీడియో ఇంటర్వ్యూకి 35 మార్కులు ఉంటాయి. ఫిజికల్ టెస్టుకి మిగిలిన 30 మార్కులు ఉంటాయి. అయితే అంపైర్ల నియామకాల కోసం బీసీసీఐ నిర్వహించిన రాతపరీక్షలో కొన్ని పిచ్చిప్రశ్నలతో అభ్యర్థులను విసిగించింది. రాత పరీక్షలో ప్రశ్నలన్నీ కఠినంగా ఉన్నప్పటికి.. కొన్ని మాత్రం వింతగా ఉండడంతో ఆశ్చర్యపోవడం ఖాయం. అలాంటి కొన్ని ప్రశ్నలు మీకోసం.. చదివేయండి.

పెవిలియన్‌లో ఫ్లడ్ లైట్స్‌తో పాటు స్టేడియం స్టాండ్స్ నీడ పడడం సహజం. అలాగే ఫీల్డర్ నీడ కూడా పిచ్‌పై పడుతూ ఉంటుంది. అలాంటి సమయంలో బ్యాటర్, అంపైర్‌కి ఫిర్యాదు చేస్తే... ఏం చేస్తారు?
బౌలర్ గాయపడి చేతికి బ్యాండేజీ కట్టుకున్నాడు. అది నిజమైనది కాదని, మీరు దాన్ని పీకేశారు. అప్పుడు రక్తస్రావం అయ్యింది. మీరేం చేస్తారు? అతనితో బౌలింగ్ చేయనిస్తారా?
షార్ట్ లెగ్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న ఫీల్డర్ హెల్మెట్ పెట్టుకోవచ్చు. అలా ఫీల్డర్ హెల్మెట్‌లో బ్యాటర్ కొట్టిన బంతి వెళ్లి ఇరుక్కుని, దాన్ని ఫీల్డర్ క్యాచ్‌గా పట్టుకుంటే అది ఔట్‌గా పరిగణిస్తారా? 

పైన చెప్పుకున్నవి కేవలం సాంపుల్‌.. ఇలాంటి వింత ప్రశ్నలు మరో 37 ఉన్నాయి. గత నెల అహ్మదాబాద్‌లో నిర్వహించిన ఈ పరీక్షకు 140 మంది హాజరయితే పరీక్ష రాయగా.. అందులో నుంచి ముగ్గురిని మాత్రమే ఎంపిక చేయనున్నారు.'' ఇది కేవలం క్రికెట్ రూల్స్ గురించి మాత్రమే కాదు. భిన్నమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఒక అంపైర్ సమయోచితంగా ఎలా నిర్ణయం తీసుకుంటాడనేది ముఖ్యం. అది తెలుసుకునేందుకు ఇలాంటి క్లిష్టమైన ప్రశ్నలతో పరీక్ష నిర్వహించాం'' అని ఒక బీసీసీఐ అధికారి వెల్లడించారు.

మరిన్ని వార్తలు