2007 టి20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌ గుర్తుందిగా.. తాజాగా ముగ్గురు మాత్రమే

22 Oct, 2021 21:23 IST|Sakshi

T20 WC 2021... 2007 టి 20 ప్రపంచకప్‌ జరిగి దాదాపు 14 సంవత్సరాలు కావొస్తుంది. ఆ వరల్డ్‌కప్‌లో టీమిండియా ఫైనల్లో తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై చారిత్రక విజయం సాధించి తొలి టి20 వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచింది. ఇక తాజాగా 2021 టి20 ప్రపంచకప్‌లో టీమిండియా పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్‌ ఆడనుంది.  కాగా 2007 టి20 ప్రపంచకప్‌ ఫైనల్లో పాకిస్తాన్‌, టీమిండియా జట్టులో ఉన్న ఆటగాళ్లలో ప్రస్తుతం ముగ్గురు మాత్రమే ఆడనున్నారు. అందులో టీమిండియా నుంచి రోహిత్‌ శర్మ ఉంటే.. పాకిస్తాన్‌ నుంచి మహ్మద్‌ హఫీజ్‌, షోయబ్‌ మాలిక్‌లు మాత్రమే ప్రస్తుతం జట్టులో ఉన్నారు. టీమిండియా- పాకిస్తాన్‌ మధ్య అక్టోబర్‌ 24న మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో మరోసారి ఈ ముగ్గురి గురించి చర్చించుకుందాం. 

చదవండి: T20 WC 2021: చరిత్ర సృష్టించిన నమీబియా; ఆటగాళ్ల సంబరం మాములుగా లేదు

రోహిత్‌ శర్మ:

14 సంవత్సరాల తర్వాత రోహిత్‌ శర్మ ప్రస్తుతం టీమిండియాకు వైస్‌ కెప్టెన్‌గా.. స్టార్‌ ఓపెనర్‌గా ఉన్నాడు. వాస్తవానికి రోహిత్‌ శర్మ టి20ల్లో అరంగేట్రం చేసింది 2007 టి20 ప్రపంచకప్‌ ద్వారానే. అప్పటికి రోహిత్‌కు పెద్దగా అనుభవం లేదు. పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో యువరాజ్‌, ధోనిలు ఔటైన తర్వాత ఆరో స్థానంలో వచ్చిన రోహిత్‌ 16 బంతుల్లో 30 పరుగులు సాధించాడు. టీమిండియా 157 పరుగులు చేయడంలో రోహిత్‌ పాత్ర కూడా ఉంది. అతని ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, ఒక సిక్స్‌ ఉన్నాయి. టీమిండియా 5 పరుగుల తేడాతో విజయం సాధించడంలో రోహిత్‌ది కూడా కీలకపాత్ర. మరి ఆదివారం పాక్‌తో జరగనున్న మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ మెరుపులు చూస్తామా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

మహ్మద్‌ హఫీజ్‌:

పాకిస్తాన్‌ వెటరన్‌ ఆల్‌రౌండర్‌ మహ్మద్ హఫీజ్‌ 2007 టి20 ప్రపం‍చకప్‌ ఫైనల్లో ఓపెనింగ్‌ స్థానంలో ఆడాడు. ఆ మ్యాచ్‌లో ఆర్‌పీ సింగ్‌ బౌలింగ్‌ తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. అంతకముందు బౌలింగ్‌లోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. మూడు ఓవర్లు వేసిన హఫీజ్‌ 25 పరుగులిచ్చి ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. కానీ 14 సంవత్సరాలు గడిచేసరికి హఫీజ్‌ పాక్‌ జట్టులో కీలక బ్యాట్స్‌మన్‌గా ఎదిగాడు. మరి ఆదివారం జరగబోయే మ్యాచ్‌లో హఫీజ్‌ ప్రభావం చూపిస్తాడా అనేది వేచి చూడాలి.

షోయబ్‌ మాలిక్‌:

2007 టి20 ప్రపంచకప్‌కు పాకిస్తాన్‌ కెప్టెన్‌గా షోయబ్‌ మాలిక్‌ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జట్టును విజయవంతంగా ఫైనల్‌ చేర్చిన అతను టీమిండియాతో జరిగిన ఫైనల్లో మాత్రం విఫలమయ్యాడు. బ్యాటింగ్‌లో 17 బంతులాడి  పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇక బౌలింగ్‌లో ఒక్క ఓవర్‌ కూడా వేయలేదు. 14 సంవత్సరాలు గడిచేసరికి షోయబ్‌ మాలిక్‌ పాక్‌ టి20 జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. వాస్తవానికి ముందు ప్రకటించిన జట్టులో షోయబ్‌ మాలిక్‌ పేరు లేదు. చివరి నిమిషంలో సోహైబ్‌ మక్సూద్‌ గాయంతో వైదొలగొడంతో కెప్టెన్‌ నిర్ణయం మేరకు షోయబ్‌ను జట్టులోకి తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృశ్యా మాలిక్‌కు చోటు దక్కడం కష్టంగానే ఉన్నప్పటికి కెప్టెన్‌ బాబర్‌ మద్దతు ఉండడంతో టీమిండియాతో మ్యాచ్‌ ఆడే అవకాశం ఉంది. 

చదవండి: T20 World Cup 2021: పొట్టి ప్రపంచకప్‌ చరిత్రలో నెదర్లాండ్స్‌ అత్యంత చెత్త రికార్డు

మరిన్ని వార్తలు