ఆడిస్తున్నారు కానీ.. మ్యాచ్‌ ఫీజు చెల్లించట్లేదు

4 Aug, 2020 03:01 IST|Sakshi

ప్రపంచ వ్యాప్తంగా టి20 లీగ్‌ల నిర్వాకం 

లండన్‌: ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ టి20 లీగ్‌ జరిగినా చక్కని ఆదరణ లభిస్తోంది. నిర్వాహకులు స్టార్లతో ఆడిస్తున్నారు... కానీ సరిగ్గా చెల్లించడమే లేదని అంతర్జాతీయ క్రికెటర్ల సంఘాల సమాఖ్య (ఎఫ్‌ఐసీఏ) తెలిపింది. ఐపీఎల్‌ గురించి తెలిసినవారెవరైనా... ఆటగాళ్లకు స్టార్‌డమ్‌తో పాటు అధిక ఆదాయం లీగ్‌ల ద్వారానే లభిస్తుందనే అనుకుంటారు. కానీ అన్ని లీగ్‌లు ఐపీఎల్‌లా లేవు. ఇదే ఆటగాళ్లకు ఆర్థిక కష్టాలను తెచ్చిపెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన టి20 లీగ్‌లు చెల్లింపుల విషయంలో ఆటగాళ్లను ఇబ్బంది పెడుతున్నాయని తాజా నివేదికలు తెలియజేస్తున్నాయి.  ఎఫ్‌ఐసీఏ చేపట్టిన వార్షిక సర్వేలో ఇవి వెలుగులోకి వచ్చాయి. లీగ్‌ల్లో పాల్గొనే ఆటగాళ్లలో మూడోవంతు క్రికెటర్లు వేతనాలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిసింది.

కొందరికి ఆలస్యంగా వేతనాలు అందగా... మరికొందరు రిక్తహస్తాలతోనే వెనుదిరిగినట్లు ఆ నివేదికల ద్వారా తెలిసింది. గ్లోబల్‌ టి20 కెనడా, బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్, అబుదాబి టి10, ఖతార్‌ టి10, యూరో టి20 స్లామ్, మాస్టర్స్‌ చాంపియన్స్‌ లీగ్‌ల్లో పాల్గొన్న 34 శాతం క్రికెటర్లు ‘చెల్లింపుల’ సమస్యలు ఎదుర్కొన్నట్లు ఎఫ్‌ఐసీఏ వెల్లడించింది. లీగ్‌ల నిర్వహణకు అనుమతులిచ్చే అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ఈ అంశంపై దృష్టి సారించాలని ఎఫ్‌ఐసీఏ సీఈఓ టామ్‌ మఫట్‌ కోరారు. మరోవైపు ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌ రూపురేఖలు, తీరుతెన్నులు గజిబిజీగా ఉన్నాయన్న ఎఫ్‌ఐసీఏ... వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ను సమస్యకు పాక్షిక పరిష్కారంగా అభివర్ణించింది.

మరిన్ని వార్తలు