National Games 2022: నేటి నుంచి జాతీయ క్రీడలు

29 Sep, 2022 05:50 IST|Sakshi

అహ్మదాబాద్‌: ఆయా క్రీడాంశాల్లో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు లేకుండానే నేటి నుంచి జాతీయ క్రీడలు అధికారికంగా మొదలుకానున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ క్రీడలను ప్రారంభిస్తారు. అక్టోబర్‌ 10 వరకు జరిగే ఈ క్రీడల్లో 28 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలతోపాటు భారత త్రివిధ దళాలకు చెందిన సర్వీసెస్‌ జట్టు నుంచి మొత్తం ఏడువేల మంది క్రీడాకారులు పోటీపడనున్నారు. మొత్తం 36 ఈవెంట్స్‌లో పతకాల కోసం పోటీలుంటాయి. గుజరాత్‌లోని అహ్మదాబాద్, గాంధీనగర్, సూరత్, వడోదర, రాజ్‌కోట్, భావ్‌నగర్‌ నగరాల్లో మ్యాచ్‌లను ఏర్పాటు చేశారు.

సైక్లింగ్‌ ఈవెంట్‌ను మాత్రం న్యూఢిల్లీలో నిర్వహిస్తారు. భారత టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) ఎల్లుండి నుంచి చైనాలో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనాల్సి ఉండటంతో... టీటీ పోటీలను ఈనెల 20 నుంచి 24 వరకు నిర్వహించారు. కబడ్డీ, లాన్‌ బౌల్స్, రగ్బీ క్రీడాంశాల్లోనూ పోటీలు మొదలయ్యాయి. ఏడేళ్ల తర్వాత మళ్లీ జాతీయ క్రీడలు జరుగుతున్నాయి. చివరిసారి 2015లో జరిగిన జాతీయ క్రీడలకు కేరళ ఆతిథ్యమిచ్చింది. ఆ క్రీడల్లో తెలంగాణ 8 స్వర్ణాలు, 14 రజతాలు, 11 కాంస్యాలతో కలిపి 33 పతకాలతో 12వ ర్యాంక్‌లో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌ 6 స్వర్ణాలు, 3 రజతాలు, 7 కాంస్యాలతో కలిపి 16 పతకాలతో 18వ స్థానంలో నిలిచింది.

మరిన్ని వార్తలు