402 పరుగుల్లో 12 పరుగులే అంటే..

29 Sep, 2020 16:30 IST|Sakshi

దుబాయ్‌: బ్యాట్స్‌మెన్‌ విరుచుకుపడతారన్న భయం లేదు. తానొక ఆఫ్‌ స్పిన్నర్‌నన్న బెరుకు లేదు. పరుగులు భారీగా ఇస్తానేమోనన్న ఆందోళన లేదు. పవర్‌ ప్లేలో బౌలింగ్‌ చేస్తున్నానన్న ఒత్తిడి లేదు. ఉన్నదల్లా తనపై తనకు నమ్మకమే... అతనే వాషింగ్టన్‌ సుందర్‌.  ప్రస్తుతం ఆర్సీబీ తరఫున ఆడుతున్న వాషింగ్టన్‌ విశేషంగా రాణిస్తున్నాడు. మూడేళ్ల క్రితం అంటే 2017 ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన సుందర్‌.. అప్పుడే తనకో ప్రత్యేకతను చాటుకున్నాడు.

ఐపీఎల్‌ పదో సీజన్‌లో క్వాలిఫయిర్-1 మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్‌పై పుణె సూపర్‌ జెయింట్‌ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన సుందర్‌ 16 పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన వాషింగ్టన్ సుందర్‌కి మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. ఆ సమయంలో ఐపీఎల్‌ ఆడుతున్న పిన్నవయస‍్కులో జాబితాలో సుందర్‌ మూడో స్థానాన్ని ఆక్రమించాడు.(చదవండి: కుంబ్లే సరసన వాషింగ్టన్‌ సుందర్‌)

మళ్లీ ముంబైపైనే..
తాజాగా ముంబై ఇండియన్స్‌పైనే వాషింగ్టన్‌ సుందర్‌ అద్భుతమైన గణాంకాలు నమోదు చేశాడు. ఐపీఎల్‌ అంటే బ్యాట్స్‌మెన్‌ గేమ్‌ అని చెప్పుకునే మనం.. వాషింగ్టన్‌ బౌలింగ్‌తో ఇది బౌలర్‌ గేమ్‌ కూడా అని అనక తప్పదు. ఆద్యంతం బ్యాటింగ్‌ ప్రవాహంలా సాగిన  ఈ మ్యాచ్‌లో వాషింగ్టన్‌ ఇచ్చిన పరుగులు 12. ఇరుజట్లు మొత్తంగా 402 పరుగులు చేస్తే సుందర్‌ 12 పరుగులే ఇచ్చాడంటే అతని ప్రతిభ అర్థమవుతోంది. ప్రధానంగా బ్యాట్స్‌మన్‌ ప్రతిదాడికి చిక్కకుండా బంతుల్ని  విసిరి శభాష్‌ అనిపించుకుంటున్నాడు. చెన్నై నుంచి వచ్చిన సుందర్‌.. తన ఐపీఎల్‌ కెరీర్‌ను పుణెతో ఆరంభించాడు. ఇప్పుడు ఆర్సీబీ తరుఫున ఆడుతూ కీలక బౌలర్‌గా నిలుస్తున్నాడు.

నిన్నటి మ్యాచ్‌లో వాషింగ్టన్‌ సుందర్‌ అద్భుతమైన బౌలింగ్‌ గణాంకాలతో మెరిశాడు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో భాగంగా తన నాలుగు ఓవర్ల స్పెల్‌లో వికెట్‌ తీసి 12 పరుగులిచ్చాడు. . ఫలింతగా ఎకానమీ రేటు 3.00గా నమోదైంది. ఇది ఆర్సీబీ తరఫున ఒక స్పిన్నర్‌ మూడో అత్యుత్తమ ఎకానమీ రేట్‌. ఫలితంగా అనిల్‌ కుంబ్లే సరసన చేరాడు వాషింగ్టన్‌ సుందర్‌.  ఇక  పవర్‌ ప్లేలో వాషింగ్టన్‌ సుందర్‌ 3 ఓవర్లలో 7 పరుగులిచ్చి వికెట్‌  తీశాడు. దాంతో అతని ఎకానమీ రేటు 2.33గా నమోదైంది.


2018 నిదహస్‌ ట్రోఫీలో కూడా.. 
రెండేళ్ల క్రితం జరిగిన నిదహస్‌ ట్రోఫీ ప్రారంభానికి ముందు సమీకరణాల ప్రకారం చూస్తే వాషింగ్టన్‌కు తుది జట్టులో చోటు కొంత అనుమానంగానే ఉండేది. అయితే, తొలి మ్యాచ్‌లోనే అవకాశం దక్కించుకున్న అతడు ఏకంగా పవర్‌ ప్లేలో బౌలింగ్‌కు దిగి చక్కటి గణాంకాలతో మెప్పించాడు. దీంతో  తర్వాతి మ్యాచ్‌లకూ కొనసాగించక తప్పలేదు. ఈ నమ్మకాన్ని సుందర్‌ ఎక్కడా కోల్పోలేదు. టోర్నీలో ప్రధాన పేసర్లు శార్దుల్‌ ఠాకూర్, ఉనాద్కట్, సిరాజ్‌లు కంటే మెరుగైన బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేశాడు. అక్కడ వాషింగ్టన్‌ ఎకానమీ 5.7 మాత్రమే. దీన్నిబట్టి అతడెంత కట్టుదిట్టంగా బంతులేశాడో తెలుస్తోంది. ఆ ట్రోఫీని భారత్‌ గెలవగా వాషింగ్టన్‌ సుందర్‌ 8 వికెట్లు సాధించాడు. చహల్‌తో కలిసి ఆ టోర్నీలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచాడు.

‘ముని వేళ్ల’ మాయాజాలం 
బ్యాట్స్‌మెన్‌ను వైవిధ్యం, ఊహాతీత బంతులతో అవుట్‌ చేయడం లెగ్‌స్పిన్నర్లకి వెన్నతో పెట్టిన విద్య. కానీ... సుందర్‌ ఆఫ్‌ స్పిన్నర్‌. అతడి మాయాజాలం అంతా మునివేళ్ల మీదనే ఉంటుంది. బ్యాట్స్‌మన్‌ భారీ షాట్‌కు యత్నిస్తున్నాడని పసిగట్టి వెంటనే బంతి వేగం తగ్గించి, లైన్‌ను మార్చేస్తాడు. ఇదే పద్దతి పాటిస్తూ బ్యాట్స్‌మన్‌ను ఇరకాటంలో పడేస్తున్నాడు. ఇక్కడ బ్యాట్స్‌మన్‌ ఏమాత్రం గాడి తప్పినా వికెట్‌ సమర్పించుకోవాల్సిందే.

Poll
Loading...
Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు