Chess Olympiad: చెస్‌ ఒలింపియాడ్‌కు వేళాయె... 

28 Jul, 2022 13:45 IST|Sakshi

గడుల ఆటకు వేళైంది.. ఎత్తుకు పైఎత్తు వేసేందుకు పోటీ దారులు సిద్ధమయ్యారు. దేశంలో తొలిసారిగా నిర్వహించనున్న అంతర్జాతీయ చెస్‌ మహా సంగ్రామానికి చెన్నై నగరం సిద్ధమైంది. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి స్టాలిన్‌ వంటి అతిరథ మహారథులు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు, వివిధ దేశాల చెస్‌ క్రీడాకారులు, అధికారులు, భద్రతా సిబ్బంది రాకతో నగరం కొత్త కాంతులీనుతోంది.

ఇక నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో గురువారం సాయంత్రం ఒలంపియాడ్‌ ప్రారంభోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం వేదికపై సాంస్కృతిక ప్రదర్శనలకు ఏర్పాట్లు చేశారు. అలాగే మహాబలిపురంలో పోటీల నిర్వహణకు ప్రత్యేక ఆడిటోరియం రూపొందించారు.

సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రపంచ చెస్‌ పండుగకు రంగం సిద్ధమైంది. 44వ చెస్‌ ఒలంపియాడ్‌ పోటీల ప్రారంభోత్స కార్యక్రమం చెన్నైలోని నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో గురువారం సాయంత్రం 6 గంటలకు కోలాహలంగా నిర్వహించనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ,  ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఈ కార్యక్రమానికి     హాజరుకానున్నారు. 
అత్యధిక దేశాలు పాల్గొంటున్న టోర్నీగా.. దేశంలో తొలిసారిగా జరిగే అంతర్జాతీయ చెస్‌ ఒలింపియాడ్‌ పోటీల ఏర్పాట్లకు తమిళనాడు ప్రభుత్వం రూ.100 కోట్లను కేటాయించింది. ‘తమిళతంబి’ పేరు న గుర్రం ముఖం రూపంలో ఓ చిహ్నాన్ని ఇందుకోసం ప్రత్యేక రూపొందించి నగరం నలుమూలలా ఏర్పాటు చేశారు. మంత్రులు, ఐఏఎస్‌ అధికారులతో పర్యవేక్షణ బృందం ఏర్పాటైంది.

చెన్నై సమీపంలోని మహాబలిపురంలో పోటీల నిర్వహణకు ఆడిటోరియం, క్రీడాకారులకు స్టార్‌ హోటళ్లలో బస, వందలాది కళాకారులతో స్వాగతం, చెన్నై నెహ్రూ స్టేడియంలో ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పోటీలను లాంఛనంగా ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్రమోదీ గురువారం చెన్నైకు చేరుకుంటారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, స్వదేశీ, విదేశీ చెస్‌ క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొంటారు. క్రీడా ప్రాంగణం పరిసరాల్లో ఏడంచెల పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.  అత్యధిక దేశా లు పాల్గొంటున్న టోర్నీగా ఇది గుర్తింపు పొందింది.

ఏర్పాట్లు పరిశీలించిన సీఎం స్టాలిన్‌ 
ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించనున్న నెహ్రూ ఇండోర్‌ స్టేడియంను సీఎం స్టాలిన్‌ బుధవారం  పరిశీలించారు. 28వ తేదీన ప్రారంభోత్సవ వేడుకలు, 29వ తేదీ నుంచి ఆగస్టు 10వరకు చెస్‌పోటీలు జరుగుతా యి. వీటిలో పాల్గొనేందుకు 1,045 మంది క్రీడాకారులు ఇప్పటికే చెన్నై చేరుకున్నారు. భారత్‌తోపాటూ అమెరికా, ఉక్రెయిన్, జర్మనీ, కజకిస్తాన్, దక్షిణాఫ్రికా , మలేషియా, ఒమన్, డెన్మార్క్‌ తదితర 162 దేశాల నుంచి 1,735 మంది క్రీడాకారులు వచ్చారు. గత నెల 19వ తేదీన ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రారంభించిన చెస్‌ ఒలంపియాడ్‌ టార్చ్‌ రిలే రన్‌ 39 రోజుల్లో 75 ముఖ్య నగరాలను చుట్టివచ్చి బుధవారం మహాబలిపురానికి చేరుకుంది. రాష్ట్ర మంత్రులు ఆ టార్చ్‌ను అందుకున్నా రు.

క్రీడాకారులను ప్రాంగణానికి చేర్చే ప్రత్యేక బస్సులకు సంబంధించిన ట్రయల్‌ రన్‌ను పోలీసులు బుధవారం  నిర్వహించారు. ఈనెల 30, 31వ తేదీల్లో తిరువాన్మియూర్, తాంబరం నుంచి మహాబలిపురానికి ప్రత్యేక బస్సులు నడుపనున్నారు. ఇక ప్రపంచ చెస్‌ ఒలంపియాడ్‌ సందర్భంగా ప్రభుత్వం నిర్వహించిన రాష్ట్రస్థాయి చెస్‌ పోటీల్లో విజేతలైన 100 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం ఉచిత పిక్నిక్‌ ట్రిప్‌ ఏర్పాటు చేసింది. ప్రత్యేక విమానంలో చెన్నై నుంచి బెంగళూరుకు వెళ్లి తర్వాత తిరుగు ప్రయాణామయ్యారు. 

ప్రధాని మోదీపై ఫొటో లేకపోవడంపై..
చెస్‌ ఒలంపియాడ్‌ పోటీ ఆహ్వానాల్లో ప్రధాని మోదీ  ఫొటో వేయకుండా వివక్ష చూపారని బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. మీడియా ప్రకటనలు, ఫ్లెక్సీల్లో ప్రపంచ స్థాయి పోటీలను ప్రారంభించే పీఎం ఫొటో లేకుండా చేయడం ఆశ్చర్యకరమని పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర కో– ఇన్‌చార్జ్‌ పొంగులేటి సుధాకర్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, చెస్‌ పోటీలను జయప్రదం చేసేందుకు బీజేపీ రాష్ట్రశాఖ సహకరిస్తున్నా తమిళనాడు ప్రభుత్వం మాత్రం ప్రోటోకాల్‌ పాటించక పోవడం బాధాకరమన్నారు. 

పీఎంపై తప్పుడు పోస్టులు పెడితే.. 
చెస్‌ పోటీలను ప్రారంభించేందుకు చెన్నైకి రానున్న ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులు పెడితే చర్యలు తప్పవని చెన్నై పోలీస్‌ కమిషనర్‌ శంకర్‌ జివాల్‌ హెచ్చరించారు. బుధవా రం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఒలంపియాడ్‌తో ప్రపంచ దేశాలన్నీ చెన్నై వైపు చూస్తున్నాయని, ఈ దశలో దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా దుష్ప్రచారానికి దిగిన వారిని ఉపేక్షించబోమని స్పష్టంచేశారు. మహాబ లిపురం పరిసరాల్లో అనుమానాస్పదంగా సంచరిస్తే అదుపులోకి తీసుకుంటామని, 22వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.


 

మరిన్ని వార్తలు