45 ఏళ్ల వయసులో ఇరగదీశాడు.. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగాడు

23 May, 2021 18:47 IST|Sakshi

లండన్‌: కౌంటీ క్రికెట్‌లో కెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న 45 ఏళ్ల ఇంగ్లీష్‌ ఆల్‌రౌండర్‌ డారెన్‌ స్టీవెన్స్‌ బౌండరీలు, సిక్సర్లతో ఆకాశమే హద్దుగా చేలరేగిపోయాడు. టాలెంట్‌కు వయసుతో సంబంధం లేదని మరోసారి నిరూపించాడు. శుక్రవారం గ్లామోర్గన్‌తో జరిగిన మ్యాచ్‌లో 149 బంతుల్లో 15 బౌండరీలు, 15 సిక్సర్ల సాయంతో 128 స్ట్రయిక్‌ రేట్‌తో 190 పరుగులు సాధించాడు. లేటు వయసులో స్టీవెన్స్‌ చేసిన విధ్వంసాన్ని చూసిన యువ క్రికెటర్లు ముక్కున వేలేసుకున్నారు. 

ఇంతటితో ఆగని స్టీవెన్స్‌ బౌలింగ్‌లోనూ అదరగొట్టాడు. ఆసీస్‌ స్టార్‌ ఆటగాడు మార్నస్‌ లబూషేన్‌ను ఎల్బీడబ్యూ చేసి వయసు మీదపడినా తనలో సత్తా ఏమాత్రం తగ్గలేదని, యువ బ్యాట్స్‌మెన్లకు సవాల్‌ విసిరాడు. ఇదిలా ఉంటే, 315 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన స్టీవెన్స్‌ 15940 పరుగులతో పాటు 565 వికెట్లు సాధించాడు. అతనికిది 36వ ఫస్ట్‌ క్లాస్‌ సెంచరీ. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన కెంట్‌.. స్టీవెన్స్‌ అద్భుత ఇన్నింగ్స్‌ సహకారంతో 307 పరుగులు స్కోర్‌ చేయగలిగింది. 

92 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును స్టీవెన్స్‌ ఆదుకున్నాడు. ఎనిమిదో వికెట్‌కు 36 పరుగులు, తొమ్మిదో వికెట్‌కు 166 పరుగులు జోడించి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించాడు. అనంతరం బౌలింగ్‌లో లబూషేన్‌ను ఔట్‌ చేసి ప్రత్యర్ధిని కోలుకోలుని దెబ్బతీశాడు. రెండు రోజు ఆట ముగిసే సమయానికి గ్లామోర్గన్‌ 2 వికెట్లు కోల్పోయి 48 పరుగులు చేసింది.   
చదవండి: సలాం సాహా.. నిజమైన ప్రొఫెషనలిజం చూపించావు

మరిన్ని వార్తలు