Ishan Kishan: సెంచరీతో చెలరేగిన ఇషాన్‌ కిషన్‌.. 5 రోజుల వ్యవధిలో మరో విధ్వంసం

15 Dec, 2022 18:05 IST|Sakshi

Ranji Trophy 2022-23: పాకెట్‌ డైనమైట్‌ ఇషాన్‌ కిషన్‌ 5 రోజుల వ్యవధిలో మరోసారి రెచ్చిపోయాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో (డిసెంబర్‌ 10) డబుల్‌ సెంచరీతో (131 బంతుల్లో 210; 24 ఫోర్లు, 10 సిక్సర్లు) విరుచుకుపడిన అతను.. రంజీ ట్రోఫీ 2022-23లో భాగంగా కేరళతో జరుగుతున్న మ్యాచ్‌లో సెంచరీతో విధ్వంసం సృష్టించాడు.

ఆట మూడో రోజు (డిసెంబర్‌ 15) బరిలోకి దిగిన ఇషాన్‌ (జార్ఖండ్‌).. 195 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్సర్లతో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. మరో ఎండ్‌తో అతనికి సౌరభ్‌ తివారీ (97) తోడవ్వడంతో జార్ఖండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 340 పరుగులకు ఆలౌటైంది. అంతకుముందు అక్షయ్‌ చంద్రన్‌ (150) భారీ సెంచరీతో చెలరేగడంతో కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 475 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.

ఆర్‌ ప్రేమ్‌ (79), కున్నుమ్మల్‌ (50), సంజూ శాంసన్‌ (72), సిజిమోన్‌ (83) అర్ధసెంచరీలతో రాణించారు. 135 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన కేరళ మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టానికి 60 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 195 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుం‍ది.

రోహన్‌ ప్రేమ్‌ (25), షౌన్‌ రోజర్‌ (28) క్రీజ్‌లో ఉన్నారు. కేరళ బౌలర్‌ జలజ్‌ సక్సేనా తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టగా.. జార్ఖండ్‌ స్పిన్నర్‌ షాబాజ్‌ నదీమ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 5, రెండో ఇన్నింగ్స్‌లో ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. ఆటలో మరో రోజు మాత్రమే మిగిలి ఉండటంతో ఫలితం తేలేది లేనిది అనుమానంగా మారింది.      


 

మరిన్ని వార్తలు