కొత్తగా సత్తా చాటేందుకు...

17 Sep, 2020 05:17 IST|Sakshi

తొలి అవకాశాన్ని అంది పుచ్చుకునే ప్రయత్నం

ఐపీఎల్‌ బరిలో భారత కుర్రాళ్లు

ఫ్రాంచైజీల ప్రత్యేక ఎంపిక

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) అంటే సూపర్‌ స్టార్ల, అంతర్జాతీయ క్రికెటర్ల ఆటే కాదు... అప్పటి వరకు అనామకులుగా కనిపించిన వారిని కూడా హీరోలుగా మార్చేస్తుంది. తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నించే భారత యువ ఆటగాళ్లకు ప్రతీ ఏటా లీగ్‌ అలాంటి అవకాశం కల్పిస్తుంది. ఈ వేదిక మీద సత్తా ప్రదర్శించి చెలరేగితే అందరి దృష్టినీ తమ వైపు తిప్పుకోవచ్చు. దేశవాళీ, జూనియర్‌ క్రికెట్‌లో ఇప్పటికే తమకంటూ కొంత గుర్తింపు తెచ్చుకున్నా... ఐపీఎల్‌ అందించే కిక్కే వేరు. అలాంటి ఆటగాళ్లను ఫ్రాంచైజీలు కూడా ఏరికోరి జట్టులోకి తీసుకున్నాయి. రాబోయే ఐపీఎల్‌ –2020లో అలా అందరి దృష్టీ నిలిచిన కొందరు ‘అన్‌క్యాప్డ్‌’ యువ భారత ఆటగాళ్ల వివరాలు...

యశస్వి జైస్వాల్‌ (రాజస్తాన్‌ రాయల్స్‌)

ఉత్తర్‌ప్రదేశ్‌లో జన్మించి ముంబైలో స్థిరపడ్డ 18 ఏళ్ల యశస్వి జైస్వాల్‌ ఈ ఏడాది అండర్‌–19 ప్రపంచకప్‌లో భారత్‌ తరఫున టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. దేశవాళీ క్రికెట్‌లో ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహించే యశస్వి పేరిట దేశవాళీ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఎన్నో ఘనతలున్నాయి. 13 లిస్ట్‌ ‘ఎ’ మ్యాచ్‌లలోనే అతను ఆరుసార్లు 50కి పైగా స్కోర్లు సాధించాడు. సగటు 70.81 కాగా, అందులో ఒక డబుల్‌ సెంచరీ ఉంది. రాజస్తాన్‌ రాయల్స్‌ తుది జట్టులో దాదాపుగా చోటు ఖాయం. మనన్‌ వోహ్రా, రాబిన్‌ ఉతప్పలతో ఓపె నర్‌ స్థానానికి పోటీ పడుతున్న యశస్వికే ఎక్కువ చాన్స్‌ ఉంది.

అబ్దుల్‌ సమద్‌ (సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌)

జమ్మూ కశ్మీర్‌కు చెందిన 19 ఏళ్ల సమద్‌ను ప్రతిభాన్వేషణలో భాగంగా స్వయంగా వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఎంపిక చేశాడు. గత సీజన్‌లో అద్భుత బ్యాటింగ్‌తో రంజీ మ్యాచ్‌లో పటిష్ట కర్ణాటకపై చెలరేగి అందరి దృష్టిలో పడ్డాడు. స్పిన్‌ బౌలింగ్‌లో విరుచుకుపడగల సత్తా ఉంది. గత రంజీ సీజన్‌లో గరిష్ట మ్యాచ్‌ల కంటే రెండు మ్యాచ్‌లు తక్కువే ఆడినా అందరికంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన ఘనత అతని సొంతం. సన్‌రైజర్స్‌ ఆరు లేదా ఏడో స్థానంలో ఆడించి ఫినిషర్‌గా వాడుకునేందుకు మంచి అవకాశం ఉంది.

రుతురాజ్‌ గైక్వాడ్‌ (చెన్నై సూపర్‌ కింగ్స్‌)

చక్కటి టెక్నిక్‌ ఉన్న దూకుడైన మహారాష్ట్ర బ్యాట్స్‌మన్‌. గత రెండు సీజన్లలో కలిపి చూస్తే భారత దేశవాళీ వన్డేల్లో అతను అందరికంటే ఎక్కువ పరుగులు (15 ఇన్నింగ్స్‌లలో 843) సాధించాడు. ధోని మాటల్లో చెప్పాలంటే ‘చురుకైన బుర్ర’ కలవాడు. సాధారణంగా అతను ఓపెనింగ్‌ లేదా మూడో స్థానాల్లో ఆడతాడు. రైనా గైర్హాజరులో 23 ఏళ్ల రుతురాజ్‌కు సత్తా ఇది సువర్ణావకాశం. జట్టు యజమాని ఎన్‌. శ్రీనివాసన్‌ కూడా ఇదే మాట చెప్పారు. కరోనా నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో ఆరంభ మ్యాచ్‌లకు ఒకవేళ దూరమైనా...తర్వాతి నుంచైనా రుతురాజ్‌ చెలరేగిపోగలడు.
 

దేవ్‌దత్‌ (రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు)

ఏడాది కాలంలో భారత దేశవాళీ క్రికెట్‌లో తన దూకుడైన ఆటలో ఎక్కువ మందిని ఆకట్టుకున్న క్రికెటర్‌ 20 ఏళ్ల దేవ్‌దత్‌. కేరళలో జన్మించి కర్ణాటక జట్టుకు ఆడుతున్న దేవ్‌దత్‌ గత దేశవాళీ సీజన్‌లో వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీ, టి20 టోర్నీ ముస్తాక్‌ అలీ ట్రోఫీ రెండింటిలో కూడా టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ముస్తాక్‌ అలీ టోర్నీలోనైతే ఏకంగా 175.75 స్ట్రయిక్‌ రేట్‌తో అతను 580 పరుగులు సాధించడం విశేషం. బెంగళూరు జట్టులో ఓపెనర్‌ స్థానంలో అతను పార్థివ్‌ పటేల్‌తో పోటీ పడుతున్నాడు.

రవి బిష్ణోయ్‌ (కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌)

అండర్‌–19 ప్రపంచకప్‌లో అత్యంత ప్రభావం చూపించిన లెగ్‌ స్పిన్నర్‌. 6 మ్యాచ్‌లలో కలిపి 17 వికెట్లు తీసిన అతడిని ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ ఏమాత్రం సమర్థంగా ఎదుర్కోలేకపోయారు. రాజస్తాన్‌కు చెందని 20 ఏళ్ల రవి బిష్ణోయ్‌ గుగ్లీలు ఎంత పెద్ద బ్యాట్స్‌మెన్‌నైనా ఇబ్బంది పెడతాయనేది సీనియర్‌ క్రికెటర్ల మాట. పంజాబ్‌ తుది జట్టులో కృష్ణప్ప గౌతమ్, అశ్విన్‌ మురుగన్‌ నుంచి పోటీ ఉన్నా... బిష్ణోయ్‌పై అందరి దృష్టి ఉంది. టీమ్‌ కోచ్‌గా లెగ్‌ స్పిన్‌ దిగ్గజం అనిల్‌ కుంబ్లే ఉండటంతో అతని మార్గనిర్దేశనంలో రవి మరింతగా రాటుదేలినట్లు టీమ్‌ వర్గాలు చెబుతున్నాయి.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు