నేటినుంచి టోక్యోలో మళ్లీ క్రీడా సంబరం

24 Aug, 2021 05:00 IST|Sakshi

పారా ఒలింపిక్స్‌ బరిలో 5400 అథ్లెట్లు

54 మందితో భారత బృందం 

సెప్టెంబర్‌ 5 వరకు పోటీలు

టోక్యో ఒలింపిక్స్‌ భారత్‌కు తొలిరోజు నుంచే పతకాన్ని, సంతోషాన్ని పంచింది. అలాగే పారాలింపిక్స్‌ కూడా ఈ సంతోషాన్ని, పతకాలను రెట్టింపు చేయాలని భారత పారాఅథ్లెట్ల బృందం గంపెడాశలతో బరిలోకి దిగుతోంది. స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ దేవేంద్ర ఝఝారియా, హైజంపర్‌ మరియప్పన్‌ తంగవేలు రియో పారాలింపిక్స్‌కు రీప్లే చూపాలనే పట్టుదలతో ఉన్నారు. ఈసారి పదికిపైగా పతకాలు సాధించాలని, స్వర్ణాల వేట కూడా పెరగాలని భారత బృందం లక్ష్యంగా పెట్టుకుంది.

టోక్యో: మరో విశ్వ క్రీడా వేడుకకు టోక్యో సిద్ధమైంది. రెగ్యులర్‌ ఒలింపిక్స్‌కు దీటుగా పారాలింపిక్స్‌ను నిర్వహించేందుకు సై అంటున్న జపాన్, మంగళవారం అట్టహాసంగా ఆరంభ సంబరాలు నిర్వహించనుంది. అనంతరం పారాథ్లెట్ల పోరాటం మొదలవనుంది. కరోనా మహమ్మారిని ఓ కంట కనిపెడుతూనే ఈ మెగా ఈవెంట్‌ను కూడా విజయవంతంగా నిర్వహించాలని టోక్యో ఆర్గనైజింగ్‌ కమిటీ పగలురేయి శ్రమిస్తోంది. ప్రేక్షకులను ఈ పోటీలకు కూడా అనుమతించడం లేదు. క్రమం తప్పని కోవిడ్‌ టెస్టులు, ప్రొటోకాల్‌ తదితర పకడ్బంది చర్యలతో పోటీలు నిర్వహిస్తారు. చదవండి: Miguel Oliveira: సవతి సోదరితో నెల రోజుల కిందట పెళ్లి.. త్వరలోనే..

ఎవరికెవరూ తీసిపోరు...
పారాలింపియన్ల పట్టుదల ముందు వైకల్యం ఎప్పుడూ ఓడిపోతూనే ఉంది. పారాలింపిక్‌ దిగ్గజం, బ్రెజిల్‌ స్విమ్మర్‌ డానియెల్‌ డియాస్‌ వరుసగా నాలుగో మెగా ఈవెంట్‌లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. 24 పతకాలు గెలుచుకున్న డానియెల్‌ ఈ సారి ఆ సంఖ్యను 30కి చేర్చుతాడనే అంచనాలున్నాయి. అమెరికా మహిళా స్విమ్మర్లు జెస్సికా లాంగ్, మెకెంజీ కోన్‌లు కూడా టోక్యో కొలనులో రియో టైటిళ్లను నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. జర్మనీ లాంగ్‌జంపర్, మార్కస్‌ రెమ్, ఇరాన్‌ ఆర్చర్‌ జహ్రా నెమటి, బ్రిటన్‌ వీల్‌చైర్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ జోర్డాన్‌ విలీ, జపాన్‌ పారాథ్లెట్‌ సాటో తొమకి తదితర స్టార్లతో టోక్యో వేదిక మురిసిపోనుంది. ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్‌ 5 వరకు 13 రోజుల పాటు జరిగే పారా విశ్వక్రీడల్లో 163 దేశాలకు చెందిన సుమారు 4500 మంది అథ్లెట్లు పాల్గొననున్నారు. 22 క్రీడలకు సంబంధించి 540 ఈవెంట్లలో పోటీలు నిర్వహిస్తారు.  

తంగవేలు పతాకధారి  
ఐదుగురు అథ్లెట్లు, ఆరు మంది అధికారులు మొత్తం 11 మందితో కూడిన భారత జట్టు మార్చ్‌పాస్ట్‌లో పాల్గొంటుంది. పతాకధారి మరియప్పన్‌ తంగవేలు మన జట్టును ముందుండి నడిపించనున్నాడు. ఇరాన్‌ తర్వాత 17వ దేశంగా భారత్‌ స్టేడియంలోకి అడుగుపెట్టనుంది. పారాలింపిక్స్‌ మార్చ్‌పాస్ట్‌లో అథ్లెట్లకు పరిమితులేమీ లేవు. అయితే టోక్యోకు భారత్‌ నుంచి ఇప్పటివరకు కేవలం ఏడుగురు అథ్లెట్లు మాత్రమే వచ్చారు. ఇందులో ఇద్దరు టేబుల్‌ టెన్నిస్‌ ప్లేయర్లు సోనల్‌ పటేల్, భవిన పటేల్‌లకు మరుసటి రోజు  (బుధవారం) పోటీలున్నాయి. దీంతో వారిని మినహాయించి ఐదుగురు అథ్లెట్లకు జతగా ఆరుగురు అధికారులు మార్చ్‌పాస్ట్‌ చేస్తారని భారత పారాలిం పిక్‌ కమిటీ కార్యదర్శి, చెఫ్‌ డి మిషన్‌ గుర్‌శరణ్‌ చెప్పా రు. మువ్వన్నెల  పతాకధారి మరియప్పన్‌ తంగవేలుతో పాటు వినోద్‌ కుమార్‌ (డిస్కస్‌ త్రో), టెక్‌ చంద్‌ (జావెలిన్‌ త్రో), జైదీప్, సకీనా ఖాతూన్‌ (పవర్‌ లిఫ్టర్లు)లు ప్రారంభోత్సవంలో కవాతు చేయనున్నారు. చదవండి: హాకీ ఆటగాళ్లకు అరుదైన గౌరవం

అఫ్గాన్‌ జెండా రెపరెపలు
అఫ్గానిస్తాన్‌లో పౌర ప్రభుత్వం కూలి... తాలిబన్ల తుపాకి రాజ్యం నడుస్తోంది. అక్కడి భీతావహ పరిస్థితులు, పౌర విమాన సేవలు లేక ఆ దేశ అథ్లెట్లు ఎవరూ పారాలింపిక్స్‌లో పాల్గొనడం లేదు. అయినాసరే వారి జాతీయ పతాకం మాత్రం రెపరెపలాడుతుందని అంతర్జాతీయ పారాలింపిక్‌ కమిటీ చీఫ్‌ అండ్రూ పార్సన్స్‌ స్పష్టం చేశారు. సంఘీభావానికి సంకేతంగా అఫ్గాన్‌ జాతీయ జెండా ప్రారంభవేడుకల్లో ఎగురుతుందని చెప్పారు. ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రతినిధి అఫ్గాన్‌ పతాకాధారిగా మార్చ్‌పాస్ట్‌లో పాల్గొంటారని పార్సన్స్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు