ఈసారి హెలికాప్టర్‌ షాట్లతో పాపులర్‌..!

13 Aug, 2020 16:26 IST|Sakshi

ముంబై: పారీ శర్మ.. ఇటీవల కాలంలో తరుచు వినిపిస్తున్న పేరు.  హరియాణాలోని రోహతక్‌కు చెందిన పారీ శర్మ.. ఏడేళ్ల వయసుకే ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.  దీనికి కారణం ఆమె క్రికెట్‌ బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ వీడియోలు నిమిషాల వ్యవధిలోనే ఎక్కువ వ్యూస్‌ను సంపాదించుకోవడం. అభిమానులే కాకుండా క్రికెట్‌ సెలబ్రెటీలు సైతం ఆమె ఆటకు మురిసిపోవడమే పారీ శర్మకు విపరీతమైన క్రేజ్‌ను తెచ్చిపెట్టింది. (7 ఏళ్లకే బ్యాటింగ్‌ ఇరగదీస్తోంది..)

సోషల్‌ మీడియాలో పారీ శర్మ బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేసే వీడియోలు ఇప్పటికే వైరల్‌ కాగా,  తాజాగా మరొక వీడియో విపరీతంగా ఆకట్టుకుంటోంది. గతంలో సచిన్‌, కోహ్లిలు ఎక్కువగా ఆడే కవర్‌ డ్రైవ్‌, లాఫ్టెడ్‌, ఆన్‌ డ్రైవ్‌ షాట్లతో క్రికెట్‌లో నైపుణ్యాన్ని వెలికితీసిన పారీ శర్మ.. ఇప్పుడు ధోని హెలికాప్టర్‌ షాట్లపై గురిపెట్టింది. వచ్చే నెలలో యూఏఈ వేదికగా జరుగనున్న ఐపీఎల్‌లో ధోని హెలికాప్టర్‌ షాట్లు చూడాలని అతని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటే, పారీ శర్మ తాను కూడా హెలికాప్టర్‌ షాట్లను ఆడతానంటూ అభిమానుల ముందుకొచ్చింది. దీనికి సంబంధించిన వీడియో క్లిప్‌ను మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా షేర్‌ చేశాడు. ‘ థర్స్‌ డే థండర్‌ బోల్ట్‌ ఇది. మన దేశానికి చెందిన పారీ శర్మలో సూపర్‌ టాలెంట్‌ ఉంది కదా’ అని క్యాప్షన్‌ ఇచ్చాడు. ఈ క్లిప్‌పై కామెంటేటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ స్పందిస్తూ.. ధోనిని మరింత ఎత్తుకు తీసుకెళ్లిన ఆ హెలికాప్టర్‌ను మళ్లీ చూస్తున్నానంటూ పేర్కొన్నాడు.

అంతకుముందు పారీ శర్మకు చెందిన ఒక వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. కచ్చితమైన ఫుట్‌వర్క్‌తో షాట్లను బాదేసిన ఆ వీడియోపై ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ నాసీర్‌ హుస్సేన్‌, మైకేల్‌ వాన్‌లతో పాటు విండీస్‌ స్టార్‌ ఆటగాడు షాయ్‌ హోప్‌లు కూడా ముగ్దులయ్యారు. ‘ప్యారీ శర్మ బ్యాటింగ్‌ స్కిల్స్‌ అమోఘం. ఇంతటి చిన్న వయసులో కచ్చితమైన ఫుట్‌వర్క్‌ అసాధారణ విషయం. ఈ వీడియోలో ఏడేళ్ల పారీ శర్మ పాదాలను పాదరసంలా కదుపుతోంది’ అంటూ పలువురు ప్రశంసించారు. భారత మహిళల క్రికెట్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించడమే తన ముందున్న లక్ష్యమంటున్న పారీ శర్మకు ఆమె తండ్రే కోచ్‌. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా