PBKS Vs RR: ఇలాంటి బ్యాటింగ్‌ జట్టుకు భారం.. అయినా అతడు నాల్గో స్థానంలో ఎందుకు?

8 May, 2022 14:15 IST|Sakshi
రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టు(PC: IPL/BCCI)

IPL 2022 PBKS Vs RR: ‘‘32 బంతుల్లో 31 పరుగులు.. భారీ లక్ష్యాలను ఛేదించే క్రమంలో ఇలాంటి ఇన్నింగ్స్‌ జట్టుకు ఉపయోగపడటం కాదు.. భారంగా మారుతుంది’’ అంటూ రాజస్తాన్‌ రాయల్స్‌ బ్యాటర్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌ ఆట తీరును టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా విమర్శించాడు. అదే విధంగా.. క్లిష్ట సమయాల్లో హిట్టర్‌ షిమ్రన్‌ హెట్‌మెయిర్‌ను ఎందుకు కాస్త ముందే రంగంలోకి దించడం లేదని ప్రశ్నించాడు. 

కాగా ఐపీఎల్‌-2022లో పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్‌ 6 వికెట్ల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. అయితే, 190 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో సంజూ బృందానికి శుభారంభం లభించినా.. ఆఖరి ఓవర్‌ వరకు పంజాబ్‌ మ్యాచ్‌ను లాక్కొని రాగలిగింది. ముఖ్యంగా పడిక్కల్‌ స్లో ఇన్నింగ్స్‌ కాస్త కంగారు పెట్టింది.  అయితే, ఓవైపు వికెట్లు పడుతున్నా అతడు పట్టుదలగా నిలబడటం గమనార్హం.

కానీ.. చివరి రెండు ఓవరల్లో హెట్‌మెయిర్‌ గనుక రాణించి ఉండకపోతే ఫలితం వేరేలా ఉండేది. 16 బంతులు ఎదుర్కొన్న అతడు 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 31 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో రెండు బంతులు మిగిలి ఉండగానే విజయం రాజస్తాన్‌ సొంతమైంది. 

ఈ ఫలితంపై స్పందించిన ఆకాశ్‌ చోప్రా.. రాజస్తాన్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఒకవేళ దేవ్‌దత్‌ పడిక్కల్‌ను ఓపెనర్‌గా పంపకపోతే.. నాలుగో స్థానంలో ఎందుకు ఆడించినట్లు? అతడిని ఐదో స్థానంలో పంపినా పెద్దగా తేడా ఏమీ ఉండదు కదా! ఒకవేళ అదే సమయంలో మీరు గనుక హెట్‌మెయిర్‌కు అవకాశం ఇచ్చి ఉంటే మెరుగ్గా ఉండేది. వీళ్లేమో(రాజస్తాన్‌) హెట్టీని, వాళ్లేమో(పంజాబ్‌) లియామ్‌ను ఎందుకు ప్రమోట్‌ చేయరో అర్థం కాదు. వాళ్లకు ఇదేం నియమమో’’ అని పేర్కొన్నాడు.

ఇక పంజాబ్‌తో మ్యాచ్‌లో అద్బుత ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన యశస్వి జైశ్వాల్‌పై ఆకాశ్‌ చోప్రా ప్రశంసలు కురిపించాడు. ‘‘యశస్వి ఆరంభంలోనే అదరగొట్టాడు. ఇక జోస్‌ ది బాస్‌(జోస్‌ బట్లర్‌) గురించి ప్రత్యేకంగా చెప్పేదేమీ లేదు. రబడ బౌలింగ్‌లో విధ్వంసం సృష్టించాడు. ఒకవేళ బట్లర్‌ ఇంకాసేపు క్రీజులో ఉండి ఉంటే 18 ఓవర్లలోనే మ్యాచ్‌ ముగిసి ఉండేది’’ అంటూ రాజస్తాన్‌ ఓపెనర్లను కొనియాడాడు.

ఐపీఎల్‌ మ్యాచ్‌: 52- పంజాబ్‌ కింగ్స్‌ వర్సెస్‌  రాజస్తాన్‌ రాయల్స్‌ స్కోర్లు
పంజాబ్‌-189/5 (20)
రాజస్తాన్‌-190/4 (19.4)

చదవండి👉🏾Kane Williamson: కేన్‌ విలియం నుంచి విలన్‌గా మారాలి.. లేదంటే: అక్తర్‌

మరిన్ని వార్తలు