India Probable XI: ఓపెనర్‌గా ఇషాన్‌ కిషన్‌.. అవేష్‌ ఖాన్‌కు నో ఛాన్స్‌!

6 Aug, 2022 15:56 IST|Sakshi

ఫ్లోరిడా వేదికగా శనివారం వెస్టిండీస్‌తో టీమిండియా నాలుగో టీ20లో తలపడనుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2–1తో ఆధిక్యంలో ఉన్న భారత్‌.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి మరో సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. మరో వైపు విండీస్‌ కూడా ఈ మ్యాచ్‌లో గెలుపొంది సిరీస్‌ను సమం చేయాలని అనుకుంటుంది. ఈ నేపథ్యంలో వెస్టిండీస్‌తో జరిగే నాలుగో టీ20కి భారత ప్లేయింగ్‌ ఎలెవన్‌ను టీమిండియా మాజీ ఆటగాడు ఆకాష్‌ చోప్రా అంచనావేశాడు.

ఈ మ్యాచ్‌లో భారత్‌ ముగ్గరు స్పిన్నర్లతో బరిలోకి దిగితే బాగుటుందని చోప్రా అభిప్రాయపడ్డాడు. కాగా ట్రినిడాడ్‌ వేదికగా విండీస్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతోనే ఆడింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. అయితే తరువాతి మ్యా్‌చ్‌ల్లో భారత్‌ అదనపు పేసర్‌తో బరిలోకి దిగింది. అయితే ఈ మ్యాచ్‌ల్లో భారత్‌ ప్లాన్‌ బెడిసి కొట్టింది అనే చెప్పుకోవాలి.

అదే విధంగా ఒక వేళ ఈ మ్యాచ్‌కు  కెప్టెన్‌ రోహిత్‌ శర్మ దూరమైతే అతడి స్థానంలో ఓపెనర్‌గా ఇషాన్‌ కిషన్‌కు అవకాశం ఇవ్వాలని చోప్రా సూచించాడు.. అదే విధంగా గత రెండు మ్యాచ్‌ల్లో పూర్తిగా విఫలమైన పేసర్‌ అవేష్‌ ఖాన్‌ స్థానంలో యువ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ తుది జట్టులోకి రానున్నాడని అతడు జోస్యం చెప్పాడు. ఒక వేళ ఈ మ్యాచ్‌కు కూడా రవీంద్ర జడేజా అందుబాటులో లేకపోతే అతడి స్థానంలో దీపక్‌ హుడాను కొనసాగించే అవకాశం ఉందని చోప్రా పేర్కొన్నాడు.

వెస్టిండీస్‌తో నాలుగో టీ20 మ్యాచ్‌కు ఆకాశ్‌ చోప్రా ఎంచుకున్న భారత తుదిజట్టు:
సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, రవీంద్ర జడేజా/దీపక్ హుడా, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్‌ సింగ్‌
చదవండి: Asia Cup 2022: ఆసియా కప్‌కు ముందు బంగ్లాదేశ్‌కు భారీ షాక్‌!

మరిన్ని వార్తలు