Indian Captain: టీ20లకు, వన్డేలకు వేర్వేరు కెప్టెన్లు ఉంటే..

17 Sep, 2021 17:39 IST|Sakshi

Aakash Chopra On Indian Captaincy: వన్డే, టీ20లకు వేర్వేరు కెప్టెన్లు ఉండటం సత్ఫలితాలను ఇవ్వకపోవచ్చని టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు ఒకే సారథి ఉంటే జట్టుకు ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నాడు. టీమిండియా టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొన్న విరాట్‌ కోహ్లి.. వన్డే, టెస్టుల్లో మాత్రం సారథిగా కొనసాగుతానని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఆకాశ్‌ చోప్రా తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా స్పందించాడు.

అతడు మాట్లాడుతూ.. ‘‘ రెడ్‌ బాల్‌, వైట్‌ బాల్‌ క్రికెట్ కెప్టెన్సీ విషయంలో పని విభజన ఉండటం మంచిదే. జో రూట్‌- ఇయాన్‌ మోర్గాన్‌, ఆరోన్‌ ఫించ్‌- టిమ్‌ పైన్‌.. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు.. టెస్టులకు వేర్వేరు కెప్టెన్లు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో వీళ్లను గమనించవచ్చు. కానీ, వన్డేలు, టెస్టులకు సారథ్య బాధ్యతలు తీసుకోవడం కాస్త విచిత్రంగా అనిపిస్తోంది. వర్కౌట్‌ అయ్యే అవకాశాలు తక్కువే అనిపిస్తోంది. నిజానికి ఒక జట్టు వన్డేలు ఆడినా, టీ20లు ఆడినా పెద్దగా తేడా ఉండదు. జట్టులో కూడా పెద్దగా మార్పులు ఉండవు. టీమిండియా విషయానికొస్తే.. ఏడు నుంచి తొమ్మిది మంది ప్లేయర్లు రిపీట్‌ అవుతూనే ఉంటారు. 

చదవండి: Virat Kohli: రోహిత్‌ను తొలగించి.. రాహుల్‌, పంత్‌కు అవకాశం ఇవ్వమన్న కోహ్లి!?

పెద్దగా మార్పులేమీ ఉండవు. అలాంటప్పుడు ఇద్దరు కెప్టెన్లు ఎందుకు? దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటే కోహ్లి వన్డేలకు ఎక్కువ రోజులు కెప్టెన్‌గా ఉండే అవకాశం లేదు. ఇక కాబోయే సారథి రోహిత్‌ శర్మ అనుకుంటే.. వచ్చే వన్డే వరల్డ్‌కప్‌ నాటికి పూర్తిస్థాయిలో జట్టును తయారుచేసుకోవాలంటే కెప్టెన్సీ విషయంలో మార్పులు చేస్తేనే బాగుంటుంది’’ అని అభిప్రాయపడ్డాడు. కాగా ఇంగ్లండ్‌ టెస్టులకు జో రూట్‌, వన్డే, టీ20లకు ఇయాన్‌ మోర్గాన్‌ సారథ్యం వహిస్తుండగా, ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల క్రికెట్‌కు ఆరోన్‌ ఫించ్‌, సంప్రదాయ క్రికెట్‌కు టిమ్‌ పైన్‌ కెప్టెన్లుగా ఉన్న సంగతి తెలిసిందే.

చదవండి: IPL 2021 Phase 2: ఈ సారి ఆ జట్టే ఐపీఎల్ విజేత!

మరిన్ని వార్తలు