‘రేపు ఇషాన్‌ కావొచ్చు.. ఆపై పంత్‌ కావొచ్చు’

16 Mar, 2021 18:50 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో భాగంగా వరుసగా రెండు టీ20ల్లో విఫలమైన టీమిండియా ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ను తదుపరి మ్యాచ్‌ల నుంచి తప్పిస్తారనే ప్రచారంపై మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా మండిపడ్డాడు. ఒకవేళ ఇదే జరిగితే మన భారత క్రికెట్‌ జట్టు.. వరల్డ్‌ టీ20కి మంచి జట్టును సిద్ధం చేసుకోవడానికి సరైన దారిలో వెళ్లనట్లేనని అభిప్రాయపడ్డాడు. ఒకటి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైతే మ్యాచ్‌ విన్నింగ్‌ ఆటగాళ్లని తప్పిస్తారా అంటూ ప్రశ్నించాడు. ఇలాగైతే మనం టీ20 వరల్డ్‌కప్‌ సరైన రొటేషన్‌ పద్ధతి అవలంభించడం లేదనే విషయాన్ని గ్రహించాలన్నాడు. ఇంగ్లండ్‌తో తొలి రెండు టీ20ల్లో రాహుల్‌ విఫలమైనంత మాత్రాన తదుపరి మ్యాచ్‌లకు దూరం పెడతారనే ప్రచారం జరుగుతుందని, ఇదే జరిగితే అది చాలా తప్పుడు నిర్ణయం అవుతుందన్నాడు.  ఇక్కడ చదవండి: ఐపీఎల్‌ అఫీషియల్‌ పార్ట్‌నర్‌గా అప్‌స్టాక్స్‌!

ఈఎస్‌పీన్‌ క్రిక్‌ఇన్ఫో ట్వీట్‌కు బదులిచ్చిన ఆకాశ్‌ చోప్రా.. ‘ మ్యాచ్‌ విన్నర్‌ అయిన క్రికెటర్‌ కేవలం రెండు మ్యాచ్‌ల్లో విఫలమైతే అతని ఆటను ప్రశ్నిస్తామా.. అతనికి ఉద్వాసన పలుకుతామా. ఒకవేళ అలా చేస్తే టీ20 వరల్డ్‌కప్‌ సరైన సన్నాహకం కాదనే చెప్పాలి. అలా తప్పించుకుంటే పోతే ఇవాళ రాహుల్‌ అవుతాడు.. రేపు ఇషాన్‌ అవుతాడు.. అటు తర్వాత పంత్‌ కూడా కావచ్చు. ఇది ఆటగాళ్లను అభద్రతా భావానికి గురి చేయడం ఖాయం. వారి స్థానాలపై నమ్మకం కోల్పోతారు’ అంటూ తెలిపాడు.  కాగా, మూడో టీ20లో రాహుల్‌కు తుది జట్టులో చోటు దక్కింది.  రోహిత్‌ తుది జట్టులోకి వచ్చినా రాహుల్‌, ఇషాన్‌లను కూడా జట్టులోకి తీసుకున్నారు.  ఇక్కడ సూర్యకుమార్‌ యాదవ్‌కు విశ్రాంతి ఇచ్చారు.  రెండో టీ20 ద్వారా భారత్‌ జట్టులోకి వచ్చిన సూర్యకుమార్‌కు బ్యాటింగ్‌ చేసే అవకాశం రాలేదు. రెండో టీ20ని భారత్‌ మూడు వికెట్లు కోల్పోయి గెలుపొందడంతో సూర్యకుమార్‌కు బ్యాటింగ్‌కు చాన్స్‌ రాలేదు. 

మరిన్ని వార్తలు