చోటా ధోనీని చూడండి.. హెలికాప్టర్‌ షాట్‌ను ఇరగదీస్తున్నాడు 

6 Jun, 2021 21:22 IST|Sakshi

ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్ ధోనీ ట్రేడ్‌ మార్క్‌ షాటైన హెలికాప్టర్ షాట్‌ను ఓ బుడ్డోడు అచ్చం అలానే ఆడేస్తున్నాడు. గ్రౌండ్‌పై బంతిని ఆడటమే ఇష్టం లేదన్నట్లుగా భారీ షాట్లతో ఇరగదీస్తున్నాడు. ప్రస్తుత క్రికెటర్లలో హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, రషీద్ ఖాన్‌లు హెలికాప్టర్ షాట్‌పై ఫర్‌ఫెక్షన్ సాధించగా, వారందరికంటే ఈ బుడ్డోడు ఇంకా మెరుగ్గా ఆడుతున్నాడు.

భారత మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా తాజాగా ఈ బుడ్డోడు అలవోకగా హెలికాప్టర్ షాట్ ఆడుతున్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. పాదాల వద్ద పడుతున్న యార్కర్లను కళ్లుచెదిరే రీతిలో హెలికాప్టర్ షాట్ ఆడుతున్న ఈ పిల్లాడు.. మిడ్ వికెట్ దిశగా, బౌలర్‌ తలపై నుంచి గాల్లో షాట్లు ఆడుతున్న తీరు అందరిని ఆశ్చర్యపరుస్తోంది. కుర్రాడి బ్యాటింగ్‌ స్టైల్‌ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. చోటా ధోనీ సూపర్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

కాగా, భారత్ జట్టులోకి వచ్చిన కొత్తలో ధోనీ ప్రతి మ్యాచ్‌లోనూ హెలికాప్టర్ షాట్ ఆడుతూ కనిపించేవాడు. అయితే వెన్నునొప్పి కారణంగా గత కొన్నేళ్లుగా ఆ షాట్‌ని ఆడటం మానేశాడు. ఇప్పటికే ఇంటర్నేషనల్ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ.. ప్రస్తుతం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు. ఇకపోతే, ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన 31 మ్యాచ్‌లను సెప్టెంబరు- అక్టోబరు మధ్యలో యూఏఈ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తున్న సంగతి తెలిసిందే.
చదవండి: కోహ్లీకి పెద్ద ఫ్యాన్‌ని అంటున్న ప్రముఖ పాక్‌ క్రికెటర్‌ భార్య..

మరిన్ని వార్తలు