'ఎంజాయ్‌ చేయాలనుకుంటే వరల్డ్‌ టూర్‌ వెళ్లండి'

25 Aug, 2020 11:57 IST|Sakshi

కరాచీ : పాకిస్తాన్‌ మాజీ ఆటగాడు అమీర్‌ సోహైల్‌ ... మిస్బా నేతృత్వంలోని కోచింగ్‌ టీంను తనదైన శైలిలో విమర్శించాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో పాక్‌ జట్టు నిరాశజనక ప్రదర్శనపై కోచ్‌లు ఏం చేస్తున్నారంటూ మండిపడ్డారు. అమీర్‌ సోహైల్‌ తన యూట్యూబ్‌ చానెల్‌లో మాట్లాడుతూ.. 'పాక్‌ ఆటగాళ్లు బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ ఇలా అన్ని విభాగాల్లో విఫలమవుతుంటే.. కోచ్‌లు చూస్తూ ఊరుకుంటున్నారే తప్ప వారికి ఎటువంటి సూచనలు చేయడం లేదు. మిస్బా నేతృత్వంలోని కోచింగ్‌ టీమ్‌ ఏం చేస్తుంది.. వారిని ఎందుకు కోచ్‌లుగా నియమించారు.. సరదాగా ఇంగ్లండ్‌ చూడడానికి వచ్చారా.. లేక పాక్‌ ఆటగాళ్లకు సలహాలు, సూచనలు ఇవ్వడానికి వచ్చారా.. ఎంజాయ్‌ చేయడానికి వచ్చాం అనుకుంటే మాత్రం కోచ్‌లందరూ కలిసి వరల్డ్‌ టూర్‌కు వెళ్లండి..మీరు కోచ్‌లుగా పనిచేయడం వ్యర్థం 'అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

కాగా పాక్‌ జట్టుకు మిస్బా ఉల్‌ హక్‌ ప్రధాన కోచ్‌గా కొనసాగడంతో పాటు పాక్‌ జాతీయ చీఫ్‌ సెలెక్టర్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. ఇక పాక్‌ బౌలింగ్‌ కోచ్‌గా వకార్‌ యూనిస్‌, ఫీల్డింగ్‌ కోచ్‌గా గ్రాంట్‌ బ్రాడ్‌బర్న్‌లు ఉన్నారు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే మొదటి మ్యాచ్‌ను ఆతిథ్య జట్టుకు సమర్పించుకున్న పాకిస్తాన్‌ 0-1 తేడాతో వెనుకపడి ఉంది. రెండో టెస్టు మ్యాచ్‌ డ్రాగా ముగియగా.. కీలకమైన మూడో టెస్టులోనూ నిరాశపరుస్తుంది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ జట్టు 8వికెట్ల నష్టానికి 583 పరుగుల వద్ద డిక్లెర్ ‌చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ జట్టు 273 పరుగులకే చాప చుట్టేసి పాలోవన్‌ ఆడుతోంది. ఇప్పటికే మూడు కీలక వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తుంది. 

చదవండి :
(ఇది నా 13 ఏళ్ల కష్టం)
(‘తప్పు చేశాం.. వరల్డ్‌కప్‌ చేజార్చుకున్నాం’)

మరిన్ని వార్తలు