అర్షదీప్‌కు అండగా నిలబడ్డ ఆమ్‌ ఆద్మీ పార్టీ

6 Sep, 2022 12:58 IST|Sakshi

ఆసియా కప్‌ 2022 సూపర్‌-4 దశలో పాక్‌తో జరిగిన హైఓల్టేజీ మ్యాచ్‌లో కీలక సమయంలో సునాయాసమైన క్యాచ్‌ డ్రాప్‌ చేసి దారుణమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్న టీమిండియా యువ పేసర్‌ అర్షదీప్‌ సింగ్‌కు అన్ని వైపుల నుంచి మద్దతు పెరుగుతుంది. సహచర ఆటగాడు, టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మ్యాచ్‌ అయిపోగానే ప్రెస్‌ మీట్‌ పెట్టి మరీ అర్షదీప్‌కు అండగా నిలబడగా.. మాజీలు హర్భజన్‌ సింగ్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, ఆకాశ్‌ చోప్రాలు సైతం యువ పేసర్‌కు మద్దతుగా నిలిచారు. తాజాగా రాజకీయ పార్టీ ఆప్‌ (ఆమ్‌ ఆద్మీ పార్టీ) కూడా తామూ అర్షదీప్‌ వెంటే అంటూ ముందుకొచ్చింది.  

ఆప్‌ ఎంపీ రాఘన్‌ చద్దా పంజాబ్‌లోని ఖరార్‌లో ఉన్న అర్షదీప్‌ ఇంటికి వెళ్లి, అతని తల్లిదండ్రులను పరామర్శించారు. ట్రోలింగ్‌ గురించి పట్టించుకోవద్దని, హైఓల్టేజీ మ్యాచ్‌ల్లో తప్పులు జరగడం సహజమని, అందు గురించి చింతించరాదని, తామంతా అర్షదీప్‌ వెంటే ఉన్నామని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.  అర్షదీప్‌ కుటుంబసభ్యులు సైతం ట్రోలింగ్‌ను పాజిటివ్‌గానే తీసుకుంటున్నామని రాఘవ్‌ చద్దాకు తెలిపారు. అర్షదీప్‌ కుటుంబ సభ్యులను కలిసిన విషయాన్ని రాఘవ్‌ చద్దా 'ఐ స్టాండ్‌ విత్‌ అర్షదీప్‌' అనే హ్యాష్ ట్యాగ్‌ జోడించి ట్విటర్‌లో షేర్‌ చేశాడు.

మరోవైపు కొందరు దురాభిమానులు అర్షదీప్‌ వికీపీడియా పేజీలో భారత్‌ బదులు ఖలిస్తాన్‌ అని ఎడిట్‌ చేయడంపై కేంద్రం సీరియస్‌ అయ్యింది. ఈ విషయమై వికీపీడియా భారత ఎగ్జిక్యూటివ్‌లకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సమన్లు జారీ చేసింది. కాగా, పాకిస్తాన్‌తో సెప్టెంబర్‌ 4 జరిగిన హోరాహోరీ సమరంలో అర్షదీప్‌ కీలక సమయంలో (15 బంతుల్లో 31 పరుగులు) సునాయాసమైన క్యాచ్‌ను జారవిడిచిన విషయం తెలిసిందే. ఫలితంగా పాక్‌.. టీమిండియాపై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.   
చదవండి: ఒత్తిడిలో తప్పులు సహజమే.. అర్షదీప్‌కు కింగ్‌ కోహ్లి మద్దతు

మరిన్ని వార్తలు