WTC Final: అతడు అత్యుత్తమ బౌలర్‌.. డబ్ల్యూటీసీ ట్రోఫీ గెలిచేది వాళ్లే: ఆసీస్‌ మాజీ కెప్టెన్‌

17 Mar, 2023 11:20 IST|Sakshi

World Test Championship 2023 FInal Ind Vs Aus: బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ-2023 సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియాతో పోటీపడనుంది. ఇంగ్లండ్‌ వేదికగా ఇరు జట్ల మధ్య జూన్‌ 7- 11 వరకు మ్యాచ్‌ జరుగనుంది. లండన్‌లోని ప్రఖ్యాత ఓవల్‌ మైదానంలో రోహిత్‌ సేన.. కమిన్స్‌ బృందాన్ని ఢీకొట్టనుంది.

కాగా మొట్టమొదటి డబ్ల్యూటీసీ 2019-21 సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత జట్టు.. వరుసగా రెండోసారి ఫైనల్‌ చేరగా.. కంగారూలు తొలిసారి తుదిపోరుకు అర్హత సాధించారు. ఇక ఇందుకు సన్నాహకంగా అన్నట్లు ఇరు జట్ల మధ్య భారత్‌ వేదికగా నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ జరిగింది.

ఫేవరెట్‌ టీమిండియా
ఇందులో ఆఖరి టెస్టు ఫలితం తేలకముందే న్యూజిలాండ్‌- శ్రీలంక మధ్య తొలి టెస్టు.. ఫైనల్లో ఆసీస్‌కు ప్రత్యర్థిగా టీమిండియాను ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ సారథి ఆరోన్‌ ఫించ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోందని వ్యాఖ్యానించాడు. ట్రోఫీ గెలిచే అవకాశాలు రోహిత్‌ సేనకే ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. 

సిరాజ్‌ ఉన్నాడు కదా!
ఇందుకు గల కారణాలు విశ్లేషిస్తూ.. ‘‘హార్దిక్‌ పాండ్యా టెస్టు మ్యాచ్‌లు ఆడే విషయం గురించి నాకు పూర్తిగా తెలియదు. అయితే.. షమీ, ఉమేశ్, సిరాజ్‌.. ఈ ముగ్గురు మంచి ఫాస్ట్‌ బౌలర్లు. ముఖ్యంగా సిరాజ్‌.. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా ఉన్నాడు.  బంతిని స్వింగ్‌ చేస్తూ బ్యాటర్లను ముప్పు తిప్పలుపెట్టగలడు.

గతంలో టీమిండియా ఇంగ్లండ్‌ను ఇంగ్లండ్‌లోనే ఓడించి సత్తా చాటింది. కాబట్టి ఈసారి ఫైనల్లో వాళ్లకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు’’ అని ఫించ్‌ పేర్కొన్నాడు. ప్రస్తుతం లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌తో బిజీగా ఉన్న అతడు హిందుస్థాన్‌ టైమ్స్‌తో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో సిరీస్‌ను టీమిండియా 2-1తో గెలిచిన విషయం తెలిసిందే. ఇక ప్రధాన పేసర్‌ బుమ్రా లేకుండానే ఈసారి భారత జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్‌ బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో ఫించ్‌  సిరాజ్‌ను ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం విశేషం.

చదవండి: Ind Vs Aus: గిల్‌కు జోడీగా టీమిండియా ఇన్నింగ్స్‌ ఆరంభించేది అతడే: హార్దిక్‌పాండ్యా
Ind Vs Aus: నేనెలా అర్హుడిని అవుతాను?! అసలు జట్టులోకి వచ్చే ఆలోచనే ఇప్పట్లో లేదు!
నంబర్‌ 1 బౌలర్‌ అశూ.. నంబర్‌ 1 ఆల్‌రౌండర్‌ జడ్డూ.. ఫైనల్లో ఆడేది ఎవరో ఒక్కరే!

మరిన్ని వార్తలు