నాటి టీమిండియా క్రికెటర్‌.. నేడు ఖగోళ శాస్త్రవేత్త

18 Aug, 2021 20:44 IST|Sakshi

ముంబై: సాధారణంగా ఆటగాళ్లు క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోవడం వల్ల వారి విద్యాభ్యాసం సజావుగా సాగదు. క్రికెట్‌లో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన చాలా మంది క్రికెటర్లు చదువుకు మధ్యలోనే ఫుల్‌ స్టాప్‌ పెట్టారు. అయితే, ఇప్పుడు మనం చూపబోయే ఈ టీమిండియా మాజీ క్రికెటర్‌.. ఎవరూ ఊహించని స్థాయిలో ఉన్నత విద్యను అభ్యసించి ఆస్ట్రోఫిజిస్ట్ అయ్యాడు. ఈ శతాబ్దపు ఆరంభంలో(2003) టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన ఆవిష్కార్ సాల్వి.. తాజాగా ఆస్ట్రోఫిజిక్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేసి, క్రికెట్ ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరుస్తూ.. భారత క్రికెట్ చరిత్రలో అత్యున్నత విద్యావంతుల జాబితాలో ముందువరుసలో నిలిచాడు.

ఒకప్పటి టీమిండియా ఫాస్ట్ బౌలర్‌ ఇప్పుడు ఖగోళ భౌతిక శాస్త్రవేత్త అని తెలుసుకుని క్రికెట్ అభిమానులు సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు. ఖగోళ భౌతిక శాస్త్రవేత్తలు నాసా లేదా ఇస్రో వంటి సంస్థల్లో పని చేస్తారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఖగోళ భౌతిక శాస్త్రంలో పీహెచ్‌డీ పూర్తి చేయాలంటే అసాధారణమైన తెలివితేటలతో పాటు ఓర్పు, సహనం ఉండాలి. అయితే అంతరిక్ష అధ్యయనాలపై మక్కువతో తాను ఆస్ట్రో ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశానని సాల్వి చెప్పుకొచ్చాడు.

కాగా, సాల్వి.. 2003లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో అతను 2 వికెట్లు పడగొట్టాడు. అయితే కేవలం 4 వన్డేలు మాత్రమే ఆడిన సాల్వి.. తీవ్రమైన గాయం కారణంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగాడు. ఆ తర్వాత ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున ఐపీఎల్‌లో కూడా పాల్గొన్నారు. 39 ఏళ్ల సాల్వి పదవీ విరమణ పొందిన అనంతరం క్రికెట్ కోచ్‌గా కూడా మారాడు. 2018లో పుదుచ్చేరి జట్టు కోచింగ్ స్టాఫ్‌లో ఒకరిగా పని చేశారు. దేశవాళీ క్రికెట్‌లో ముంబైకి ప్రాతినిధ్యం వహించిన సాల్వి.. 50 ఫస్ట్ క్లాస్, లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో ఆడాడు. ఇదిలా ఉంటే, భారత మాజీ క్రికెటర్లలో కుంబ్లే, లక్ష్మణ్, అశ్విన్, ద్రవిడ్ లాంటి క్రికెటర్లు అత్యున్నత చదువులు చదువుకున్నారు. అయితే వారందరికంటే అత్యున్నత విద్యను అభ్యసించిన సాల్వి 'ది మోస్ట్ ఎడ్యుకేటెడ్ ఇండియన్ క్రికెటర్'గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 
చదవండి: వికెట్లను కాకుండా వ్యక్తులను టార్గెట్‌ చేయడమేంటి..?

మరిన్ని వార్తలు