AB De Villiers-Chris Gayle: ఆర్‌సీబీ మాజీ క్రికెటర్లకు అరుదైన గౌరవం

17 May, 2022 18:42 IST|Sakshi

ఆర్‌సీబీ మాజీ క్రికెటర్లు ఏబీ డివిలియర్స్‌,  క్రిస్‌ గేల్‌ను ఆ జట్టు యాజమాన్యం అరుదైన గౌరవంతో సత్కరించింది. ఆ జట్టు ఇటీవలే ఒక కార్యక్రమంలో హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ను పరిచయం చేసింది. ఆర్‌సీబీ తరపున సేవలందించిన క్రికెటర్లకు ఇందులో స్థానం దక్కనుంది. అయితే ఆర్‌సీబీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ జాబితాలో తొలుత చేరిన క్రికెటర్లు.. ఏబీ డివిలియర్స్‌, క్రిస్‌ గేల్‌ కావడం విశేషం. కొన్నేళ్ల పాటు తమ సేవలను ఆర్సీబీకి అందించినందుకు కృతజ్ఞతగా వారిని హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చేరుస్తున్నట్లు ఆర్‌సీబీ యాజమాన్యం ట్విటర్‌లో ప్రకటించింది.

దానికి సంబంధించిన వీడియోనూ రిలీజ్‌ చేసింది. ఈ వీడియోలో  హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో జాయిన్‌ అయిన ఏబీ డివిలియర్స్‌, క్రిస్‌ గేల్‌ను ఆర్‌సీబీ మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, ప్రస్తుత కెప్టెన్‌ డుప్లెసిస్‌, ఆర్‌సీబీ డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌ మైక్‌ హెసన్‌లు అభినందిస్తూ స్పీచ్‌ ఇచ్చారు. ఆ తర్వాత వారిద్దరికి ఆన్‌లైన్‌ వేదికగానే వారి పేర్లతో పాటు జెర్సీ నెంబర్‌ ఉన్న గోల్డ్‌ మెటల్‌ మొమొంటోతో  సత్కరించారు.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)తో గేల్‌, డివిలియర్స్‌కు విడదీయరాని బంధం ఉంది. డివిలియర్స్‌ 184 ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో 5162 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, 40 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఇక యునివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ 142 మ్యాచ్‌లాడి 4965 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు సెంచరీలు, 31 అర్థ సెంచరీలు ఉన్నాయి.  

చదవండి: Kane Williamson: ఇంకెంత కాలం విలియమ్సన్‌ను భరిస్తారు.. తుది జట్టు నుంచి తప్పించండి!

మరిన్ని వార్తలు