-

AB De Villiers: ఇండియాకు వచ్చెయ్‌.. పంత్‌​ స్థానంలో ఆడు!

19 May, 2021 11:36 IST|Sakshi

న్యూఢిల్లీ: విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిలియర్స్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌తో భారత ఫ్యాన్స్‌కు మరింత చేరువయ్యాడు మిస్టర్‌ 360. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఏబీడీ.. ఐపీఎల్‌-2021లో తనదైన శైలిలో ఆడుతూ వినోదాన్ని పంచాడు. ఇక టోర్నీ వాయిదా పడటంతో అతడు స్వదేశానికి పయనమైన సంగతి తెలిసిందే. అయితే, 2018లో రిటైర్మెంట్‌ ప్రకటించిన డివిలియర్స్‌.. లీగ్‌ మ్యాచ్‌లలో అద్భుత ఫామ్‌ కొనసాగిస్తుండటంతో అతడు దక్షిణాఫ్రికా క్రికెట్‌లో పునరాగమనం చేస్తాడని అభిమానులు భావించారు.

కానీ, తన నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని డివిలియర్స్‌ సహా  దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు (సీఎస్‌ఏ) అధికారికంగా ప్రకటన వెలువరించడంతో ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది. ఇక ఏబీడీపై గుండెల నిండా అభిమానం నింపుకున్న ఇండియన్‌ ఫ్యాన్స్‌ మాత్రం.. భారత పౌరసత్వం తీసుకుని, టీమిండియాకు ఆడాలంటూ ట్విటర్‌ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు. 

పంత్‌ స్థానంలో వచ్చెయ్‌..
‘‘ రిషభ్‌ పంత్‌ స్థానంలో భారత  జట్టులో వికెట్‌ కీపర్‌ పాత్రను నువ్వు పోషించాలి. టెస్టుల్లో పంత్‌ బెస్ట్‌ కానీ వన్డేలు, టీ20ల్లో అతడు అంతంత మాత్రమే. కాబట్టి నువ్వు ఇండియాకు వచ్చి సెటిల్‌ అవ్వు ప్లీజ్‌’’ అని నెటిజన్‌ కామెంట్‌ చేయగా.. ‘‘హమ్మయ్య.. ఏబీడీ రిటైర్మెంట్‌పై నిర్ణయం మార్చుకోలేదు. సంతోషం. టీమిండియా వికెట్‌ కీపర్‌గా నీకు స్థానం దక్కుతుంది డివిలియర్స్‌’’ అంటూ మరొకరు చమత్కరించారు.

ఇక మరికొంత మంది.. ‘‘ లెజెండ్స్‌కు ఎప్పటికీ రిటైర్మెంట్‌ ఉండదు. నువ్వు.. మా  ఆల్‌టైమ​ ఫేవరెట్‌ క్రికెటర్‌వి’’అంటూ అభిమానం చాటుకుంటున్నారు. ఇంకొంత మంది మాత్రం.. రాబోయే టీ20 వరల్డ్‌ కప్‌లో ఏబీతో టీమిండియాకు పొంచి ఉన్న గండం తప్పింది అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

చదవండిKuldeep Yadav: క్రికెటర్‌ తీరుపై అధికారుల అసహనం

మరిన్ని వార్తలు