IPL 2023: ఆర్సీబీ ఒక్కసారి ట్రోఫీ గెలిస్తే... వరుసగా 3- 4 టైటిళ్లు గెలుస్తుంది: ప్రొటిస్‌ దిగ్గజం

18 Nov, 2022 13:11 IST|Sakshi
ఆర్సీబీ (PC: IPL/BCCI)

IPL 2023- Royal Challengers Bangalore: జట్టులో ఎంతో మంది స్టార్‌ ప్లేయర్లు.. విరాట్‌ కోహ్లి వంటి రికార్డుల ధీరులు.. ఒంటి చేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల సమర్థులు.. అయినా ఇంత వరకు ఒక్క టైటిల్‌ కూడా గెలవని జట్టుగా అపవాదు.. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఫ్రాంఛైజీ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు పరిస్థితి ఇది. కోట్లాది మంది అభిమాన గణం.. ‘‘ఈ సాలా కప్‌ నామ్దే(ఈసారి కప్‌ మాదే)’’ అంటూ గత పదిహేనేళ్లుగా ఎదురుచూస్తున్నా వారి కలలు నెరవేర్చలేకపోతోంది.

గత మూడు సీజన్లుగా అద్భుతంగా రాణిస్తున్నా కీలక సమయాల్లో చతికిలపడి టోర్నీ నుంచి నిష్క్రమిస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ మాజీ ఆటగాడు, దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒక్కసారి ఆర్సీబీ ట్రోఫీ​ గెలిచిందంటే వరుసగా టైటిళ్లు సొంతం చేసుకుంటుందని జోస్యం చెప్పాడు.

ఇప్పటికి 15 సీజన్లు పూర్తయ్యాయనుకుంటా
స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో డివిలియర్స్‌ మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికి 15 సీజన్లు పూర్తయ్యాయనుకుంటా.. వాళ్లు సవాళ్లను అధిగమించాలని పట్టుదలటా ఉన్నారు. ఆర్సీబీ ఒక్కసారి గెలిచిందంటే.. వాళ్లు రెండు, మూడు, నాలుగు గెలుస్తూనే ఉంటుంది.

టీ20 క్రికెట్‌ అంటేనే అంచనాలు తలకిందులు చేసే ఫార్మాట్‌. పొట్టి క్రికెట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. ముఖ్యంగా నాకౌట్‌ మ్యాచ్‌ల ఫలితాలు అంచనా వేయలేం. అయితే ఈసారి ఆర్సీబీ మారుతుందనే ఆశిస్తున్నా’’ అంటూ ఆర్సీబీ ఈసారి టైటిల్‌ గెలవాలని ఆకాంక్షించాడు. 

రీ ఎంట్రీ
కాగా 2011లో బెంగళూరుకు ఆడటం మొదలుపెట్టిన మిస్టర్‌ 360 డివిలియర్స్‌.. 11 సీజన్ల పాటు ఆ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఇక క్యాష్‌ రిచ్‌ లీగ్‌కు గుడ్‌ బై చెప్పిన ఈ ప్రొటిస్‌ దిగ్గజం ఈసారి ‘రీ ఎంట్రీ’ అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే, ఆటగాడినా లేదంటే మరే ఇతర పాత్రలోనైనా కనిపిస్తాడా అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఐపీఎల్‌-2023 మినీ వేలం డిసెంబరులో కొచ్చి వేదికగా జరుగనుంది. కాగా గత సీజనల్లో ఫాఫ్‌ డుప్లెసిస్‌ ఆర్సీబీకి కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే.

చదవండి: భారత్‌-న్యూజిలాండ్ తొలి టీ20 ఆలస్యం.. కారణమిదే

మరిన్ని వార్తలు