'ఈ ప్రదర్శన నాకే ఆశ్చర్యం కలిగించింది'

22 Sep, 2020 13:45 IST|Sakshi

దుబాయ్‌ : ఏబీ డివిలియర్స్‌.. విధ్వంసానికి పట్టింది పేరు. క్రీజులో పాతుకుపోయాడంటే ఇక అవతలి బౌలర్లకు చుక్కలు కనిపిస్తాయి. మైదానం నలువైపులా షాట్లు ఆడే డివిలియర్స్‌కు 360 డిగ్రీస్‌ ఆటగాడు అనే ముద్దు పేరు కూడా ఉంది. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన డివిలియర్స్‌ ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్ బెంగళూరు‌ తరపున ఆడుతున్న సంగతి తెలిసిందే. 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత అప్పుడప్పుడే మాత్రమే క్రికెట్‌ ఆడుతున్న ఏబీ సోమవారం సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో  విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాచ్‌లో మొదట ఓపెనర్‌ దేవదూత్‌ పడిక్కల్‌ 56 పరుగుల క్లాస్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా.. తర్వాత ఏబీ 31 బంతుల్లోనే 51 పరుగులు చేశాడు. ఏబీ ఇన్నింగ్స్‌ దాటికి ఆర్‌సీబీ జట్టు స్కోరు 160 పరుగులు దాటింది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం ఏబీ డివిలియర్స్‌ ఇన్నింగ్స్‌ ప్రదర్శనపై పలు ఆసక్తికర విషయాలు పంచకున్నాడు. (చదవండి : కేన్‌ విలియమ్సన్‌ అందుకే ఆడలేదా..)

'నిజాయితీగా చెప్పాలంటే సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నా ప్రదర్శన నాకే ఆశ్చర్యం కలిగించింది. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి దూరంగా ఉంటున్న నాకు మొదటి మ్యాచ్‌లోనే ఇలాంటి ప్రదర్శన చేస్తానని అనుకోలేదు. సాధారణంగా దక్షిణాఫ్రికాలో ప్రశాంత వాతావరణంలో నా ప్రాక్టీస్‌ను కొనసాగించా. అదే విశ్వాసంతో దుబాయ్‌కు చేరుకున్న నేను ఆర్‌సీబీ జట్టుతో కలిశా. ఐపీఎల్‌ ప్రారంభానికి ముందు ప్రాక్టీస్‌కు నాలుగు వారాల సమయం దొరికింది. ఆ సమయాన్ని నేను చక్కగా ఉపయోగించుకున్నట్లు మ్యచ్‌ ముగిసిన అనంతరం నాకు అర్థమయింది.

సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రనౌట్‌ కావడం కొంచెం బాధ కలిగించినా... నా ప్రదర్శరనతో మాత్రం సంతృప్తిగానే ఉన్నా. ఐపీఎల్‌ 13వ సీజన్‌లో యంగ్‌ ఇండియన్‌ ప్లేయర్స్‌ టాలెంట్‌కు కొదువ లేదు.. అలాగే ఆసీస్‌ తరపున యంగ్‌ ప్లేయర్స్‌ ఈ ఐపీఎల్‌లో మంచి సత్తా చాటనున్నారు. అందుకు ఉదాహరణే జోష్‌ పిలిప్పి.. మా జట్టులో ఉన్న అద్భుతమైన ఆటగాళ్లలో ఒకడు.. అవకాశం రావాలే కాని తనేంటో నిరూపించుకుంటాడని ' చెప్పుకొచ్చాడు. (చదవండి : బ్యాట్స్‌మన్‌ కంటే కెప్టెన్‌గానే ఎక్కువ చూస్తామేమో!)

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఓపెనర్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌ (42 బంతుల్లో 56; 8 ఫోర్లు), డివిలియర్స్‌ (30 బంతుల్లో 51; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో మెరిపించారు. లక్ష్యఛేదనకు దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 19.4 ఓవర్లలో 153 పరుగుల వద్ద ఆలౌటైంది. బెయిర్‌స్టో (43 బంతుల్లో 61; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒక్కడే అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు.  సన్‌రైజర్స్‌ హైదరబాద్‌ ఇన్నింగ్స్‌లో 16వ ఓవర్లో యజువేంద్ర తన మణికట్టు మాయాజాలంతో రెండు కీలక వికెట్లు తీయడంతో మ్యాచ్‌ ఒక్కసారిగా టర్న్‌ అయింది. మ్యాచ్‌లో   3 వికెట్లు తీసిన చహల్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా ఎంపికయ్యాడు.

మరిన్ని వార్తలు