Abhimanyu Easwaran: తండ్రి కట్టిన స్టేడియంలోనే తనయుడు సెంచరీ! శభాష్‌ అభిమన్యు

5 Jan, 2023 16:32 IST|Sakshi

భారత జట్టులో చోటు కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న బెంగాల్‌ ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్ ప్రస్తుతం జరగుతున్న రంజీ ట్రోఫీలో అదరగొడుతున్నాడు. డెహ్రాడూన్‌ వేదికగా  ఉత్తరాఖండ్‌తో మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో  ఈశ్వరన్ అద్భుతమైన సెంచరీ సాధించాడు.

తొలి ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, 1 సిక్స్‌లతో ఈశ్వరన్‌ 165 పరుగులు సాధించాడు. అతడితో పాటు టాప్‌ఆర్డర్‌ బ్యాటర్‌ సుదీప్ ఘరామి 90 పరుగులతో రాణించాడు. వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్‌ల ఫలితంగా బెంగాల్‌ తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఉత్తరాఖండ్‌ కూడా తొలి ఇన్నింగ్స్‌లో 272 పరుగులకు ఆలౌటైంది.

తండ్రి కట్టిన స్టేడియంలోనే తనయుడు సెంచరీ
అభిమాన్యు ఈశ్వరన్.. తన తండ్రి తన పేరిట నిర్మించిన గ్రౌండ్‌లోనే సెంచరీ సాధించడం విశేషం. అభిమన్యు తండ్రి  రంగనాథన్ పరమేశ్వరన్ ఈశ్వరన్ డెహ్రాడూన్‌లో ఓ క్రికెట్‌ స్టేడియాన్ని నిర్మించాడు. దానికి అభిమన్యు క్రికెట్ అకాడమీగా పేరు పెట్టాడు. అయితే ఇప్పటివరకు చాలా రంజీ మ్యాచ్‌లు జరిగాయి.

కానీ ఈ వేదికలో బెంగాల్‌ జట్టుకు ఇదే తొలి మ్యాచ్‌. కాగా అభిమాన్యు ఈశ్వరన్ స్వస్థలం డెహ్రాడూన్‌ అయినప్పటకీ దేశీవాళీ క్రికెట్‌లో మాత్రం బెంగాల్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో తొలి సారిగా తన తండ్రి నిర్మించిన స్టేడియంలో అభిమాన్యు ఈశ్వరన్ మ్యాచ్‌ ఆడాడు.

అయితే ఆడిన తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించడంతో అభిమాన్యు తండ్రి ఆనందానికి అవధులు లేవు. అదే విధంగా తన పేరిట నిర్మించిన స్టేడియంలోనే మ్యాచ్‌లో ఆడిన తొలి క్రికెటర్‌గా ఈశ్వరన్ రికార్డులకెక్కాడు.
 

మరిన్ని వార్తలు