వాళ్లు లేకపోయినంత మాత్రానా ఐపీఎల్‌ నిర్వహణ ఆగదు..

31 May, 2021 19:52 IST|Sakshi

దుబాయ్‌: విదేశీ ఆటగాళ్లు అందుబాటులో లేకపోయినంత మాత్రానా ఐపీఎల్‌ 2021 సీజన్‌ నిర్వహణ ఆగదని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ప్రణాళిక ప్రకారమే యూఏఈ వేదికగా సెప్టెంబరు 18 నుంచి అక్టోబరు 10 మధ్యలో లీగ్‌ను నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. టీ20 ప్రపంచకప్‌కు ముందు ఐపీఎల్‌ మిగిలిన మ్యాచ్‌లను ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని బీసీసీఐ పట్టుదలతో ఉన్నట్లు పేర్కొన్నారు. కొందరు విదేశీ ఆటగాళ్లు లీగ్‌కు దూరంగా ఉన్నా, భారత స్టార్‌ ఆటగాళ్లు లీగ్‌కు వన్నె తెస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. 

వెస్టిండీస్‌ పర్యటన నిమిత్తం కొందరు, వ్యక్తిగత కారణాలచే మరికొందరు ఆసీస్‌ ఆటగాళ్లు ఐపీఎల్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వస్తున్న వార్తలు వాస్తవమేనని, ఈ విషయమై ఆయా ఫ్రాంఛైజీలు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించే పనిలో నిమగ్నమై ఉన్నాయని ఆయన తెలిపారు. ఐపీఎల్‌ నిర్వహణ ప్రణాళిక, షెడ్యూల్‌ తదితర అంశాలపై చర్చించేందకు బీసీసీఐ ఆఫీస్‌ బేరర్లు త్వరలోనే యూఏఈలో సమావేశమవుతారని ప్రకటించారు. కాగా, పలువురు విదేశీ ఆటగాళ్లు తమతమ అంతర్జాతీయ జట్లకు ప్రాతినిధ్యం వహించాల్సి ఉండటంతో లీగ్‌కు దూరంగా ఉంటారని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో శుక్లా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇదిలా ఉంటే, భారత్‌లో కరోనా కేసులు అధికమవడం కారణంగా మే 4న ఐపీఎల్‌ 14 ఎడిషన్‌ నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. 
చదవండి: ప్రేయసిని హత్తుకుని భావోద్వేగానికి లోనైన ఆసీస్‌ క్రికెటర్‌..

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు