వన్డే మ్యాచ్‌.. రికార్డు స్కోర్‌, భారీ విజయం

1 Mar, 2023 16:09 IST|Sakshi

ACC Mens Challenger Cup 2023: ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న ఏసీసీ మెన్స్‌ ఛాలెంజర్‌ కప్‌-2023లో రికార్డు విజయం నమోదైంది. టోర్నీలో భాగంగా మయన్మార్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌదీ అరేబియా ఏకంగా 327 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఏసీసీ మెన్స్‌ ఛాలెంజర్‌ కప్‌ చరిత్రలో ఇది భారీ విజయంగా రికార్డైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌదీ అరేబియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 424 పరుగులు చేయగా.. ఛేదనలో మయన్మార్‌ 25.3 ఓవర్లలో 97 పరగులకే చాపచుట్టేసి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది.

సౌదీ ఇన్నింగ్స్‌లో అబ్దుల్‌ మనన్‌ అలీ (102) సెంచరీతో చెలరేగగా.. మహ్మద్‌ హిషమ్‌ షేక్‌ (59), అబ్దుల్‌ వహీద్‌ (61), జైన్‌ ఉల్‌ అబ్దిన్‌ (66 నాటౌట్‌) అర్ధసెంచరీలతో రాణించారు. మయన్మార్‌ బౌలర్లలో ఖిన్‌ అయే, ఔంగ్‌ ఖో ఖో తలో 2 వికెట్లు పడగొట్టగా.. పైంగ్‌ దాను, సాయ్‌ హ్టెట్‌ వై, కో కో లిన్‌థు ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు. మయన్మార్‌ ఇన్నింగ్స్‌లో కేవలం ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోర్‌ చేయగా.. వీరిలో యే నైంగ్‌ తున్‌ (29) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. సౌదీ బౌలర్లలో అబ్దుల్‌ వహీద్‌ 4 వికెట్లు పడగొట్టగా.. జైన్‌ ఉల్‌ అబ్దిన్‌ 2, అబ్దుల్‌ వహీద్‌, జుహైర్‌ మహ్మద్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు. ఈ విజయంతో సౌదీ అరేబియా దర్జాగా సెమీస్‌ఫైనల్లోకి ప్రవేశించింది.
 

మరిన్ని వార్తలు