T20 World Cup 2022: నీటి అడుగుభాగంలో టి20 ప్రపంచకప్‌.. ఏం జరిగింది?

20 Jul, 2022 18:02 IST|Sakshi

టి20 ప్రపంచకప్‌ 2022 ఈ ఏడాది అక్టోబర్‌-నవంబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరగనుంది. ప్రస్తుతం ప్రతిష్టాత్మకమైన ఐసీసీ మెన్స్‌ టి20 ప్రపం‍చకప్‌ దేశాలను చుట్టి వస్తోంది. తాజాగా ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన పొట్టి ప్రపం‍చకప్‌ను ఆస్ట్రేలియా క్రికెటర్‌ ఆడమ్‌ జంపా.. స్పోర్ట్స్‌ ప్రెజంటర్‌ ఎరిన్‌ హోలాండ్‌, ఆస్ట్రేలియన్‌ పారాలింపిక్స్‌ స్విమ్మర్‌ గ్రాంట్‌ పాటర్‌సన్‌లు ఒక స్పెషల్‌ ప్లేసుకు తీసుకెళ్లారు. ఆస్ట్రేలియాకు తలమానికంగా నిలిచే ప్రపంచంలోనే అతిపెద్ద కోరల్‌ రీఫ్‌ సిస్టమ్‌గా పిలచే గ్రేట్‌ బారియర్‌ రీఫ్‌కు టి20 ప్రపం‍చకప్‌ను పట్టుకెళ్లారు.

గాలి కూడా దూరని ఒక గ్లాసులో టి20 ప్రపంచకప్‌ను ఉంచి గ్రేట్‌ బారియర్‌ రీఫ్‌ నీటి అడుగుభాగంలోకి తీసుకెళ్లారు. దానికి సంబంధించిన ఫోటోలను ఐసీసీ టి20 ప్రపంచకప్‌తో పాటు ఎరిన్‌ హోలాండ్‌ తమ ట్విటర్‌లో షేర్‌ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. టి20 ప్రపంచకప్‌ టూర్‌లో భాగంగా ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన ప్రపంచకప్‌ ఆస్ట్రేలియాలో ఎనిమిది రాష్ట్రాల్లో 21 నగరాలతో పాటు యూనియన్‌ టెర్రటరీస్‌లో సందర్శనకు రానుంది. ఆస్ట్రేలియాతో పాటు దాదాపు 12 దేశాల్లో టి20 ప్రపంచకప్‌ చుట్టి రానుంది. 

ఇక గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా జట్టు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆసీస్‌కు ఇదే తొలి టి20 ప్రపంచకప్‌ టైటిల్‌ కాగా.. న్యూజిలాండ్‌ మరోసారి రన్నరప్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. ఇక ఈ ఏడాది అక్టోబర్‌ 16  నుంచి నవంబర్‌ 13 వరకు జరగనుంది. గ్రూఫ్‌ 1లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, అఫ్గానిస్తాన్‌తో పాటు మరో రెండు క్వాలిఫై జట్లు ఉండగా.. గ్రూప్‌ 2లో టీమిండియా, పాకిస్తాన్‌, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌తో పాటు మరో రెండు క్వాలిఫయింగ్‌ జట్లు ఉండనున్నాయి.

చదవండి: Fans Troll Kasun Rajitha: ఎంత పని చేశావ్‌.. లంక జట్టులో మరో 'హసన్‌ అలీ'

మరిన్ని వార్తలు