Kho Kho -League: ఖో–ఖో లీగ్‌లో జీఎంఆర్, అదానీ ఫ్రాంచైజీలు

7 Jun, 2022 08:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మరో గ్రామీణ క్రీడకు కార్పొరేట్‌ సంస్థలు వెన్నుదన్నుగా నిలిచేందుకు ముందుకొచ్చాయి. ఇప్పటికే ప్రొ కబడ్డీ అద్భుతమైన ఆదరణ చూరగొనగా... ఖో ఖో కూడా అల్టిమేట్‌ ఖో ఖో (యూకేకే) పేరుతో ఫ్రాంచైజీ టోర్నీగా మనల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. దీంట్లో హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తున్న ప్రముఖ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీ జీఎంఆర్‌ గ్రూప్, గుజరాత్‌కు చెందిన అదానీ గ్రూప్‌లు భాగమయ్యాయి. తమ సొంత రాష్ట్రాలకు చెందిన జట్లను ఈ రెండు కార్పొరేట్‌ సంస్థలు దక్కించుకున్నాయి.

జీఎంఆర్‌కు ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్రాంచైజీ, ప్రొ కబడ్డీ లీగ్‌లో యూపీ యోధ జట్టు ఉన్నాయి. జీఎంఆర్‌ స్పోర్ట్స్‌ తెలంగాణ ఫ్రాంచైజీని... అదానీ స్పోర్ట్స్‌లైన్‌ గుజరాత్‌ ఫ్రాంచైజీలను కొనుగోలు చేశాయని యూకేకే ప్రమోటర్, డాబర్‌ గ్రూప్‌ చైర్మన్‌ అమిత్‌ బర్మన్‌ వెల్లడించారు. క్రీడల్లోనూ భారత్‌ అగ్రగామిగా అవతరించేందుకు తమవంతుగా కృషి చేస్తున్నామని, గ్రామీణ క్రీడలైన కబడ్డీ, రెజ్లింగ్, ఖో ఖోలకు మరింత ఆదరణ పెరిగేందుకు దోహదం చేస్తామని జీఎంఆర్‌ గ్రూప్‌ కార్పొరేట్‌ చైర్మన్‌ గ్రంధి కిరణ్‌ కుమార్‌ తెలిపారు. అల్టిమేట్‌ ఖో ఖో (యూకేకే) బ్రాడ్‌కాస్టింగ్‌ హక్కుల్ని సోనీ సంస్థ దక్కించుకుంది. సోనీ టీవీ చానెళ్లతో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ‘సోనీ లివ్‌’లో యూకేకే పోటీలు స్ట్రీమింగ్‌ కానున్నాయి.
చదవండి:SL vs AUS: శ్రీలంకతో ఆస్ట్రేలియా తొలి టి20.. మ్యాక్స్‌వెల్ మాయ చేస్తాడా..?

మరిన్ని వార్తలు