టెస్టుల్లో ఆడడం టీమిండియాకు అతి పెద్ద సవాలు..కారణమిదే: గవాస్కర్

31 May, 2023 16:07 IST|Sakshi
భారత జట్టు(ఫైల్‌ ఫోటో)

లండన్‌ వేదికగా జరగున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2023లో ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడనున్న విషయం విధితమే. ఈ ఫైనల్‌ పోరు లండన్‌లోని ఓవల్‌ స్టేడియం వేదికగా వేదికగా జూన్‌ 7 నుంచి 11 వరకు జరగనుంది. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్ గవాస్కర్ టీమిండియాను ఉద్దేశించి ఆసక్తికర వాఖ్యలు చేశాడు.

నేరుగా టీ20లు నుంచి టెస్టు క్రికెట్‌ ఆడటం భారత జట్టుకు పెద్ద సవాల్‌ అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. కాగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపికైన భారత జట్టులో పుజరా మినహా మిగితా ఆటగాళ్లందరూ ఐపీఎల్‌-2023లో భాగమయ్యారు. ఐపీఎల్‌ ముగిసిన వెంటనే భారత జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌ ఆడనుండంతో గవాస్కర్ ఇటువంటి వాఖ్యలు చేశాడు.

"డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు పుజరా మినహా మిగితా ఆటగాళ్లందరూ టీ20 ఫార్మాట్‌లో ఆడి బయటకు వచ్చారు. కాబట్టి భారత ఆటగాళ్లకు ఇంగ్లండ్‌ గడ్డపై గట్టి సవాలు ఎదురుకానుంది. టెస్ట్ క్రికెట్ సుదీర్ఘ ఫార్మాట్. టీ20 మైండ్‌సెట్‌తో ఆడితే సరిపోదు. ఛెతేశ్వర్ పుజారా కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో పుజరా ఆడుతున్నాడు కాబట్టి అక్కడి పరిస్థితులకు బాగా అలవాటు పడి ఉంటాడు.

అతడు రాణించాల్సిన అవసరం చాలా ఉంది. అతడితో పాటు రహానేకు కూడా ఇంగ్లండ్‌లో ఆడిన అనుభవం ఎక్కువగా ఉంది. రహానే ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడని నేను అనుకుంటున్నారు. అతడు తన అనుభవవాన్ని మరోసారి నిరూపించుకోవాల్సి ఉంటుంది. రహానేకు ఇది అద్భుతమైన అవకాశం. అతడు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటాడని భావిస్తున్నాను" అని స్టార్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవాస్కర్  పేర్కొన్నాడు.
చదవండి: WTCFinal2023: ఇంగ్లండ్‌ గడ్డపై అడుగుపెట్టిన ఆ ఐదుగురు! ఫోటోలు వైరల్‌

మరిన్ని వార్తలు