అలుపెరగని యోధుడు రషీద్‌ ఖాన్‌.. మనిషా.. రోబోనా అంటున్న జనం

23 Feb, 2023 17:01 IST|Sakshi

ఫ్రాంచైజీ క్రికెట్‌ రాకతో ఆటగాళ్లు జాతీయ జట్టుకు ఆడటం గగనమైపోయిన ఈ రోజుల్లో ఆఫ్ఘనిస్తాన్‌ టీ20 జట్టు కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌ అటు జాతీయ జట్టును బ్యాలెన్స్‌ చేసుకుంటూ ఏకకాలంలో ప్రపంచ నలుమూలల్లో జరిగే అన్ని లీగ్‌ల్లో పాల్గొంటూ యావత్‌ క్రీడా ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాడు. ఇది అంత ఆషామాషీ విషయం కానప్పటికీ.. రషీద్‌ ఖాన్‌ మాత్రం రోబోలా శ్రమిస్తూ అలుపెరుగని యోధుడనిపించుకుంటున్నాడు.

గత మూడు నెలల కాలంలో రషీద్‌ ఖాన్‌ షెడ్యూల్‌ని ఓ సారి పరిశీలిస్తే. నిర్ఘాంతపోయే విషయాలు వెలుగుచూస్తాయి. గతేడాది (2022) డిసెంబర్‌ 14 నుంచి ఈ ఏడాది (2023) జనవరి 5 వరకు ఆస్ట్రేలియాలో జరిగిన బిగ్‌బాష్‌ లీగ్‌లో పాల్గొన్న రషీద్‌.. ఆ తర్వాత జనవరి 10 నుంచి ఫిబ్రవరి 6 వరకు సౌతాఫ్రికాలో జరిగిన ఇనాగురల్‌ ఎస్‌ఏ20 లీగ్‌లో ఆడాడు.

ఆ వెంటనే ఫిబ్రవరి 9న దుబాయ్‌ బయల్దేరిన అతను ఆ రోజు ఆ మరుసటి రోజు ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌లో పాల్గొన్నాడు. దీని తర్వాత ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన రషీద్‌.. యూఏఈలో ఆ జట్టుతో జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పాల్గొన్నాడు. ఆ వెంటనే రెండు రోజుల గ్యాప్‌లో (ఫిబ్రవరి 21) పాకిస్తాన్‌లో వాలిపోయిన రషీద్‌.. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో కంటిన్యూ అవుతున్నాడు.

రషీద్‌ ఇలా గ్యాప్‌ లేకుండా ప్రపంచం నలుమూలలా తిరుగుతూ క్రికెట్‌ ఆడుతుండటాన్ని గమనిస్తున్న క్రికెట్‌ అభిమానులు.. ఇతను మనిషా లేక రోబోనా అని చర్చించుకుంటున్నారు. ఓ పక్క ప్రయాణాల్లో అలిసిపోతూ, మరో పక్క ఫిట్‌నెస్‌ కాపాడుకుంటూ రాణిస్తున్న రషీద్‌ ఖాన్‌ను చూసి జనం‍ ముక్కున వేలేసుకుంటున్నారు.

చాలామంది అంతర్జాతీయ స్టార్స్‌ రషీద్‌ను చూసి అసూయ పడుతున్నారు. తనలా తామెందుకు విరామం లేకుండా ఆడలేకపోతున్నామంటూ తమను తాము ప్రశ్నించుకుంటున్నారు. భారత క్రికెట్‌ అభిమానులైతే బుమ్రాను టార్గెట్‌ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. రషీద్‌ ఓ పక్క ఫ్రాంచైజీ క్రికెట్‌ ఆడుతూనే జాతీయ జట్టుకు కూడా ఆడుతున్నాడు.. నీకు ఏమైందంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

బుమ్రా.. ఐపీఎల్‌ కోసం జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడంటూ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో అభిమానులు ఇలా స్పందిస్తున్నారు. ఏదిఏమైనప్పటికీ రషీద్‌ ఖాన్‌లా అలుపెరగని యోధుడిలా క్రికెట్‌ ఆడటం మాత్రం చాలా గొప్ప విషయమని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కాగా, రషీద్‌ ఖాన్‌ భారత్‌లో జరిగే ఐపీఎల్‌ కూడా ఆడతాడన్న విషయం అందరికీ తెలిసిందే. అతను ప్రస్తుత ఐపీఎల్‌ ఛాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
 

మరిన్ని వార్తలు