రోడ్డు ప్రమాదం: క్రికెటర్‌ దుర్మరణం

6 Oct, 2020 12:00 IST|Sakshi

కాబూల్‌: ఆఫ్గనిస్తాన్‌ యువ క్రికెటర్‌, టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ నజీబ్‌ తరకాయ్‌(29) దుర్మరణం చెందాడు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడు ప్రాణాలు కోల్పోయాడు. స్థానిక మీడియా కథనం ప్రకారం.. వారం రోజుల కిందట తూర్పు నంగన్‌హర్‌లో రోడ్డు దాటుతున్న క్రమంలో ఓ కారు నజీబ్‌ను ఢీకొట్టింది. దీంతో అతడు తీవ్ర గాయాలపాలు కాగా ఆస్పత్రిలో చేర్పించారు. అయితే వైద్యులు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.(చదవండి: హీల్స్‌ ధరించి క్రికెట్‌ ఫీల్డ్‌లో తిరుగుతారా?)

కాగా నజీబ్‌ మరణవార్తను అఫ్గనిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు మంగళవారం ధ్రువీకరించింది. యువ క్రికెటర్‌ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బోర్టు.. దేశమంతా విషాదంలో మునిగిపోయిందని ట్వీట్‌ చేసింది. నజీబ్‌ మరణం తమకు తీరని లోటు అని, దూకుడుగా ఇన్నింగ్‌ ఆరంభించే ఓపెనర్‌, మంచి మనిషిని కోల్పోయామని విచారం వ్యక్తం చేసింది. రోడ్డు ప్రమాదంలో అతడు దుర్మరణం పాలయ్యాడని, నజీబ్‌ లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామంటూ సంతాపం తెలిపింది.

ఆరు సెంచరీలు చేశాడు
ఆఫ్గనిస్తాన్‌ క్రికెట్‌ జట్టు తరఫున 12 వన్డేలు ఆడిన నజీబ్‌.. 2017లో ఐర్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో 90 పరుగులతో రాణించి ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 47.20 సగటు కలిగి ఉన్న ఈ బ్యాట్స్‌మెన్‌.. కెరీర్‌ మొత్తంలో ఆరు సెంచరీలు చేశాడు. గతేడాది జరిగిన  ష్పగిజా క్రికెట్‌ లీగ్‌లో స్పీన్‌ ఘర్‌ టైగర్స్‌ తరఫున మైదానంలో దిగిన నజీబ్‌.. టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అదే విధంగా సెప్టెంబరులో మిస్‌ ఐనాక్‌ నైట్స్‌ స్క్యాడ్‌లో అతడు భాగస్వామిగా ఉన్నాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు