Afghanistan: ‘పాకిస్తాన్‌తో వన్డే సిరీస్‌’.. అఫ్గన్‌ బోర్డు కీలక నిర్ణయం

23 Sep, 2021 14:06 IST|Sakshi

పాకిస్తాన్‌ను వన్డే సిరీస్‌ కోసం ఆహ్వానించే యోచనలో అఫ్గన్‌ బోర్డు

Afghanistan Cricket Board Cheif Azizullah Fazli: అఫ్గనిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు నూతన చైర్మన్‌ అజీజుల్లా ఫజ్లీ కీలక నిర్ణయం తీసుకున్నాడు. బోర్డు కార్యకలాపాలను గాడిలో పెట్టి... మెరుగైన భవిష్యత్తు కోసం వివిధ దేశాలతో వరుస సిరీస్‌లు నిర్వహించే దిశగా చర్యలు చేపట్టినట్లు తెలిపాడు. ఇందులో భాగంగా తొలుత పాకిస్తాన్‌ను సందర్శిస్తానని.. ఆ తర్వాత భారత్‌, బంగ్లాదేశ్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డు యాజమాన్యాలతో చర్చలు జరుపనున్నట్లు వెల్లడించాడు.

ఈ మేరకు.. ‘‘పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు కొత్త చైర్మన్‌ రమీజ్‌ రాజాతో ఈ నెలలో సమావేశమవుతాను. శ్రీలంకలో ఆడాల్సిన వన్డే సిరీస్‌ కోసం మా దేశం రావాల్సిందిగా ఆహ్వానిస్తాను. సెప్టెంబరు 25న పాకిస్తాన్‌ పర్యటన తర్వాత భారత్‌, బంగ్లాదేశ్‌, యూఏఈ క్రికెట్‌ బోర్డు అధికారులతో భేటీ అవుతాను. అఫ్గనిస్తాన్‌ క్రికెట్‌ను అభివృద్ధి చేయాలని భావిస్తున్నాం. ఇతర దేశాల సహకారంతోనే ఇది జరుగుతుందని నేను భావిస్తున్నా’’ అని ఫజ్లీ పేర్కొన్నట్లుగా వార్తా సంస్థ ఏఎఫ్‌పీ కథనం ప్రచురించింది. 

కాగా చివరిసారిగా వన్డే వరల్డ్‌కప్‌-2019లో అఫ్గన్‌- పాకిస్తాన్‌ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో పాక్‌ గెలుపొందింది. ఈ క్రమంలో వరల్డ్‌ కప్‌ సూపర్‌ లీగ్‌ సిరీస్‌ నిర్వహణలో భాగంగా ఈ ఏడాది శ్రీలంకలో ఇరు జట్ల మధ్య జరగాల్సిన సిరీస్‌ కోవిడ్‌ కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. అఫ్గన్‌లో సదరు మ్యాచ్‌ నిర్వహించే దిశగా పాక్‌ బోర్డుతో చర్చలు జరిపేందుకు ఏసీబీ చైర్మన్‌ అజీజుల్లా ఫజ్లీ నిర్ణయించాడు.

ఇదిలా ఉండగా.. అఫ్గనిస్తాన్‌ తాలిబన్ల వశమైన నేపథ్యంలో సాధారణ ప్రజలు సహా ఎంతో మంది సెలబ్రిటీలు దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విదేశాల్లో లీగ్‌ మ్యాచ్‌లు ఆడుతున్న అఫ్గన్‌ క్రికెటర్లు సైతం తమ కుటుంబ సభ్యుల గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు.. భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్తాన్‌లో పర్యటించాల్సిన న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌ తమ టూర్‌ రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాలిబన్ల పాలనలో ఉన్న అఫ్గన్‌.. పాక్‌ను తమ దేశ పర్యటనకు రావాల్సిందిగా కోరడం గమనార్హం. ఇక మెగా ఈవెంట్‌ టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా అక్టోబరు 29న అఫ్గనిస్తాన్‌- పాకిస్తాన్‌ ముఖాముఖి తలపడనున్నాయి.

చదవండి: Shoaib Akhtar: ‘ముందు టీమిండియా.. ఆ తర్వాత న్యూజిలాండ్‌.. వదిలిపెట్టొద్దు’
Ramiz Raja: భరించాం, సహించాం.. మంచి గుణపాఠం చెప్పారు.. కానీ..

మరిన్ని వార్తలు