తాలిబన్ల మధ్యే కుటుంబం: పీటర్సన్‌ వద్ద రషీద్‌ ఆవేదన

17 Aug, 2021 12:18 IST|Sakshi

Rashid Khan అఫ్గనిస్తాన్‌లో తాలిబన్లు అరాచక పాలనతో రాజ్యమేలుతున్న వేళ ఆ దేశ స్టార్‌ క్రికెటర్‌ రషీద్‌ ఖాన్‌  తీవ్ర ఆందోళన చెందుతున్నాడు. ప్రస్తుతం కుటుంబానికి అందుబాటులో లేకుండా పోయిన రషీద్‌ ఖాన్‌.. తన కుటుంబం ఏమౌతుందోననే భయాందోళనలో మునిగిపోయాడు. తన కుటుంబాన్ని కాపాడాలంటూ ఆవేదన చెందాడంటూ ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ కెవిన్‌ పీటర్సన్‌ తెలిపాడు. ప్రస్తుతం రషీద్‌ ఖాన్‌ ఇంగ్లండ్‌ వేదికగా హండ్రెడ్‌ టోర్నీలో ట్రెంట్‌ రాకెట్స్‌ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. రషీద్‌ యూకేలో ఉండిపోవడం.. తన కుటుంబసభ్యులు మాత్రం అఫ్గన్‌లో ఉండడంతో వారికేమైనా జరుగుతుందేమోనని కలవరపడుతున్నాడు.తాలిబన్ల అరాచక పాలన తట్టుకోలేక ఆ దేశ ప్రజలు ప్రాణ భయంతో వేరే చోటికి తరలిపోతున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది తమ ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. ఇదే విషయమై రషీద్‌ పీటర్సన్‌తో చర్చించినట్లు తెలుస్తోంది.

''అఫ్గనిస్తాన్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై రషీద్‌తో చర్చించా. ఈ విషయమై అతను చాలా బాధపడుతున్నాడు. ఏ క్షణం ఏ వార్త వినాల్సి వస్తుందో అని భయపడుతున్నాడు. రషీద్‌కు కుటుంబం అంటే ప్రాణమని.. వారిని విడిచి ఉండలేడని.. అందుకే తన వాళ్లకు ఏం కాకూడదని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాడు. అఫ్గాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో కాబుల్‌ విమానాశ్రయానికి విమానాలు నిలిచిపోయాయి. దీంతో తన కుటుంబాన్ని అఫ్గన్‌ నుంచి తరలించిలేక కుమిలిపోతున్నాడు. ఈ ఒత్తిడి నుంచి రషీద్‌ తొందరగా బయటపడాలని కోరుకుంటున్నా'' అంటూ చెప్పుకొచ్చాడు.

ఇటీవలే అఫ్గనిస్తాన్‌లో శాంతిని నెలకొల్పేందుకు ప్రపంచ నేతలు చొరవ తీసుకోవాలని రషీద్‌ ట్విటర్‌ వేదికగా విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.మరోవైపు తాలిబన్లకు క్రికెట్‌ అంటే ఇష్టమని.. వారు మద్దతిస్తారని.. మా కార్యకలపాలకు అడ్డుపడరని అఫ్గన్‌ క్రికెట్‌ సీఈవో హమీద్‌ షీన్వారీ మంగళవారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్య్వూలో తెలిపాడు.

మరిన్ని వార్తలు