BAN vs AFG: ఓడిపోతారన్న దశలో ప్రపంచ రికార్డు భాగస్వామ్యంతో గెలిపించారు

24 Feb, 2022 08:29 IST|Sakshi

అఫ్గనిస్తాన్‌తో జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్‌ సంచలన విజయం సాధించింది. 45 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనించింది. ఈ దశలో అఫిఫ్‌ హొస్సేన్‌ (115 బంతుల్లో 93 నాటౌట్‌, 11 ఫోర్లు, 1 సిక్సర్‌), మెహదీ హసన్‌(120 బంతుల్లో 81 నాటౌట్‌, 9 ఫోర్లు) అద్బుత ఇన్నింగ్స్‌ ఆడారు. చివరి వరకు నిలిచిన ఈ ఇద్దరు ఏడో వికెట్‌కు 174 పరుగుల రికార్డు భాగస్వామ్యంతో చరిత్ర సృష్టించడమే గాక బంగ్లాదేశ్‌కు మరుపురాని విజయం అందించారు .

ఈ విజయంతో బంగ్లాదేశ్‌ మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్గనిస్తాన్‌ 49.1 ఓవర్లలో 215 పరుగులుకు ఆలౌటైంది. నజీబుల్లా 67 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. రహమత్‌ 34 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్‌ బౌలర్లలో ముస్తాఫిజుర్‌ 3, తస్కిన్‌ అహ్మద్‌, షకీబ్‌, షోరిఫుల్‌ హొసెన్‌ తలా రెండు వికెట్లు పడగొట్టారు. కాగా బంగ్లాదేశ్‌ మ్యాచ్‌ విజయంతో పాటు పలు రికార్డులు బద్దలు కొట్టింది.

►వన్డే క్రికెట్‌ చరిత్రలో ఏడో వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన రెండో జంటగా మెహదీ హసన్‌, అఫిఫ్‌ హొస్సేన్‌లు నిలిచారు. తొలి స్థానంలో ఇంగ్లండ్‌కు చెందిన జాస్‌ బట్లర్‌, ఆదిల్‌ రషీద్‌లు( 177 పరుగులు భాగస్వామ్యం, 2015లో న్యూజిలాండ్‌పై) ఉన్నారు.
►ఇంతకముందు బంగ్లాదేశ్‌కు వన్డేల్లో ఏడో వికెట్‌కు ఇమ్రుల్‌ కైస్‌, మహ్మద్‌ సైఫుద్దీన్‌ జోడి నమోదు చేసిన 127 పరుగుల భాగస్వామ్యం అత్యుత్తమంగా ఉంది. తాజాగా ఈ రికార్డును మెహదీ హసన్‌- అఫిఫ్‌ హొస్సేన్‌ జోడి బద్దలు కొట్టింది.
►ఇక బంగ్లాదేశ్‌ తరపున వన్డేల్లో ఏడో వికెట్‌కు 100 పరుగులకు పైగా భాగస్వామ్యం నమోదు చేసిన మూడో జంటగా మెహదీ హసన్‌- అఫిఫ్‌ హొస్సేన్‌లు నిలిచారు. అంతకముందు ఇమ్రుల్‌ కైస్‌- మహ్మద్‌ సైఫుద్దీన్‌(2018లో జింబాబ్వేపై), ముష్ఫికర్‌ రహీమ్‌- నయీమ్‌ ఇస్లామ్‌(2010లో న్యూజిలాండ్‌పై) ఉన్నారు.
►బంగ్లాదేశ్‌ తరపున ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి వన్డేల్లో 50ప్లస్‌ స్కోర్లు రెండుసార్లు సాధించిన మూడో ఆటగాడిగా మెహదీ హసన్‌ నిలిచాడు. ఇంతకముందు నాసిర్‌ హొసేన్‌, మహ్మద్‌ సైఫుద్దీన్‌లు ఉన్నారు.

చదవండి: Sanju Samson: సంజూలో మంచి టాలెంట్‌ ఉంది.. సరైన రీతిలో వాడుకుంటాం: రోహిత్‌ శర్మ

మరిన్ని వార్తలు