పొట్టి క్రికెట్‌లో పెను విధ్వంసం.. 28 బంతుల్లోనే శతకం

8 Jun, 2021 18:21 IST|Sakshi

యూరోపియన్ క్రికెట్ సిరీస్‌లో ఓ అనామక ఆటగాడు పెను విధ్వంసం సృష్టించాడు. 13 సిక్సర్లు, ఏడు ఫోర్ల సాయంతో 33 బంతుల్లో ఏకంగా 115 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో అతను 28 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి, యూరోపియన్ క్రికెట్ సిరీస్ చరిత్రలో భారత సంతతికి చెందిన గౌహర్ మనన్(29 బంతుల్లో) పేరిట​ఉన్న ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్డును బద్దలు కొట్టాడు. కమ్మర్‌ఫెల్డర్ స్పోర్ట్‌వెరిన్ జట్టు తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగిన 32 ఏళ్ల అహ్మద్ ముస్సాదిక్.. టిహెచ్‌సిసి హాంబర్గ్‌ జట్టుపై వీరవిహారం చేయడంతో ఆ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. 

ఈ మ్యాచ్‌లో ముస్సాదిక్‌ తొలి బంతి నంచే బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. స్పిన్నర్లు, పేసర్లు అన్న తేడా లేకుండా బంతి బాదడమే లక్ష్యంగా పెట్టుకుని, ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ క్రమంలో 13 బంతుల్లో అర్ధ శతకం, 28 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసి ఇన్నింగ్స్‌ ఆఖరి బంతికి వెనుదిరిగాడు. అనంతరం 199 పరుగలు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ప్రత్యర్థి జట్టు.. 10 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి కేవలం 53 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ముస్సాదిక్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు 145 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
చదవండి: టీమిండియా క్రికెటర్లు లేకుండానే ఐసీసీ అవార్డులు

మరిన్ని వార్తలు