అహ్మదాబాద్‌లో ఫైనల్‌

18 Apr, 2021 06:25 IST|Sakshi

టి20 ప్రపంచకప్‌ కోసం 9 వేదికలను సిద్ధం చేసిన బీసీసీఐ

హైదరాబాద్‌లోనూ మ్యాచ్‌లు

న్యూఢిల్లీ: భారత్‌ వేదికగా ఈ ఏడాది అక్టోబర్‌–నవంబర్‌ నెలల్లో జరిగే టి20 ప్రపంచకప్‌ కోసం భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) తొమ్మిది వేదికలను ఎంపిక చేసింది. ఇందులో హైదరాబాద్‌ కూడా చోటు దక్కించుకోవడం విశేషం. ఎంపికైన వేదికల్లో హైదరాబాద్‌తోపాటు ముంబై, న్యూఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, ధర్మశాల, అహ్మదాబాద్, లక్నో నగరాలు ఉన్నాయి. భారత్‌ ఆతిథ్యమిచ్చిన 2016 టి20 ప్రపంచకప్‌కు వేదికలుగా ఉన్న మొహాలీ, నాగ్‌పూర్‌లు మాత్రం ఈసారి చోటు దక్కించుకోలేదు. ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్‌ స్టేడియంగా పేరొందిన అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియంలో ఫైనల్‌ జరగనుంది. తొలుత ఆరు వేదికల్లోనే టి20 ప్రపంచకప్‌ను నిర్వహించాలని బీసీసీఐ భావించినా... రాష్ట్ర క్రికెట్‌ సంఘాల నుంచి ఒత్తిడి రావడంతో మరో మూడు వేదికలను అదనంగా చేరుస్తూ నిర్ణయం తీసుకుంది. వీటికి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) నుంచి అనుమతి లభించాల్సి ఉంది.

ప్లాన్‌ ‘బి’ కూడా ఉంది...
ప్రస్తుతం భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్రత అధికంగా ఉంది. ఒకవేళ టి20 ప్రపంచకప్‌ నాటికి దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొనకపోతే... 9 వేదికల మధ్య టోర్నీలో పాల్గొనే 16 జట్లు ప్రయాణించడానికి అంత సౌకర్యంగా ఉండదు. దాంతో ఇటువంటి ప్రతికూల పరిస్థితులను అధిగమించడానికి బీసీసీఐ ప్లాన్‌ ‘బి’ని సిద్ధం చేసింది. అక్టోబర్‌ నాటికి కరోనా తీవ్రత తగ్గకపోతే ప్రపంచకప్‌ను నాలుగు వేదికల్లోనే నిర్వహించేలా బీసీసీఐ రెడీ అయింది. దీనికి సంబంధించిన ప్రణాళికను త్వరలోనే ఐసీసీకి నివేదించనుంది.

పాక్‌ వీసాలకు ఢోకా ఉండదు...
టి20 ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చే పాకిస్తాన్‌ క్రికెటర్లకు వీసాలను మంజూరు చేసేందుకు భారత ప్రభుత్వం సమ్మతించిందని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు.

మరిన్ని వార్తలు