వచ్చే ఏడాది భారత చెస్‌ లీగ్‌ 

15 Dec, 2021 11:04 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ వేదికగా చదరంగ క్రీడలో కూడా ఫ్రాంచైజీ తరహా లీగ్‌ టోర్నీని నిర్వహించాలని అఖిల భారత చెస్‌ సమాఖ్య (ఏఐసీఎఫ్‌) నిర్ణయించింది. వచ్చే ఏడాది జూన్‌లో దీనికి శ్రీకారం చుట్టనున్నారు. చెస్‌ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు ఉంటాయి. ఒక్కో జట్టులో ఇద్దరు సూపర్‌ జీఎంలు, ఇద్దరు భారత జీఎంలు, ఇద్దరు మహిళా జీఎంలతో పాటు ఇద్దరు జూనియర్లు (బాలుర, బాలికల విభాగం నుంచి ఒక్కొక్కరు చొప్పున) ఉంటారు.

రెండు వారాల పాటు డబుల్‌ రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో దేశంలోని రెండు నగరాల్లో టోర్నీని నిర్వహిస్తారు. టాప్‌–2 జట్లు ఫైనల్లో తలపడతాయి. టోర్నీ నిర్వహణ, ప్రచారం, మార్కెటింగ్‌ కోసం ‘గేమ్‌ ప్లాన్‌ స్పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ అనే సంస్థకు హక్కులు ఇచ్చామని ప్రకటించిన ఏఐసీఎఫ్‌ అధ్యక్షుడు సంజయ్‌ కపూర్‌... ఫ్రాంచైజీల ఎంపిక, ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి ఇతర పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. 

మరిన్ని వార్తలు