END Vs SA: ఇంగ్లండ్‌ కెప్టెన్‌ అద్బుత విన్యాసం.. మార్క్రమ్‌ డైమండ్‌ డక్‌

23 Jul, 2022 18:08 IST|Sakshi

సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌ మధ్య శుక్రవారం జరిగిన రెండో వన్డేలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జాస్‌ బట్లర్‌ అద్బుత విన్యాసం అబ్బురపరిచింది. ఐడెన్‌ మార్ర్కమ్‌ను ఔట్‌ చేసే క్రమంలో బట్లర్‌ అమాంతం డైవ్‌ చేస్తూ త్రో వేసిన విధానం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌ 4వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. డేవిడ్‌ విల్లే వేసిన ఆ ఓవర్లో ఐదో బంతిని క్లాసెన్‌ డిఫెన్స్‌ ఆడాడు. అయితే క్విక్‌ సింగిల్‌ కోసం ప్రయత్నించిన మార్క్రమ్‌ అనవసరంగా పరిగెత్తాడు.

అప్పటికే క్లాసెన్‌ వద్దని వారించినా మార్ర్కమ్‌ వినకుండా సగం క్రీజు దాటేశాడు. అప్పటికే చిరుత వేగంతో పరిగెత్తుకొచ్చిన జాస్‌ బట్లర్‌ అమాంతం డైవ్‌ చేస్తూ బంతిని వికెట్లకు విసిరాడు. అంతే సెకన్ల వ్యవధిలో బంతి వికెట్లను గిరాటేయడంతో మార్క్రమ్‌ రనౌట్‌ అయ్యాడు. కాగా ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే మార్ర్కమ్‌ డైమండ్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే ఇంగ్లండ్‌ 118 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా 29 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లీష్‌ జట్టు 28.1 ఓవర్లలో 201 పరుగులకు ఆలౌటైంది. జట్టులో ఏ ఒక్క ఆటగాడు చెప్పుకోదగ్గ స్కోర్‌ చేయలేకపోయినా, ఆఖర్లో లివింగ్‌స్టోన్‌ (26 బంతుల్లో 38; ఫోర్‌, 3 సిక్సర్లు), సామ్‌ కర్రన్‌ (18 బంతుల్లో 35; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపుల సాయంతో ఇంగ్లండ్‌ భారీ స్కోర్‌ సాధించగలిగింది. సఫారీ బౌలర్లలో ప్రిటోరియస్‌ (4/36), నోర్జే (2/53), షంషి (2/39), కెప్టెన్‌ కేశవ్‌ మహారాజ్‌ (1/29)లు వికెట్లు సాధించారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లీష్‌ బౌలర్లు మూకుమ్మడిగా రెచ్చిపోవడంతో సఫారీ జట్టు 20.4 ఓవర్లలో కేవలం 83 పరుగులకే కుప్పకూలింది. 

A post shared by We Are England Cricket (@englandcricket)

చదవండి: కెరీర్‌లో సవాళ్లు సహజం.. నేను ఇప్పుడే అలాంటి నిర్ణయం తీసుకోను! ఎందుకంటే!

మరిన్ని వార్తలు