Ajinkya Rahane: డబుల్‌ సెంచరీతో చెలరేగిన రహానే.. రెండో ద్విశతకం! టీమిండియాలో చోటు ఖాయమంటూ..

21 Dec, 2022 12:50 IST|Sakshi
జింక్య రహానే(ఫైల్‌ ఫొటో)

Ranji Trophy 2022-23 Mumbai vs Hyderabad: భారత క్రికెటర్‌, ముంబై జట్టు కెప్టెన్‌ అజింక్య రహానే డబుల్‌ సెంచరీతో మెరిశాడు. రంజీ ట్రోఫీ 2022-23లో భాగంగా హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ద్విశతకం బాదాడు. తొలి ఇన్నింగ్స్‌లో మొత్తంగా 261 బంతులు ఎదుర్కొన్న ఈ ముంబై సారథి.. 26 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 204 పరుగులు సాధించాడు.

కాగా ముంబై- హైదరాబాద్‌ మధ్య డిసెంబరు 20న ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌ వేదికగా టెస్టు మ్యాచ్‌ ఆరంభమైంది. టాస్‌ గెలిచిన హైదరాబాద్‌ బౌలింగ్‌ ఎంచుకోగా.. బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఆదిలోనే వికెట్‌ కోల్పోయింది.

తేలిపోయిన హైదరాబాద్‌ బౌలర్లు
ఓపెనర్‌ పృథ్వీ షా 19 పరుగులకే పెవిలియన్‌ చేరాడు. అయితే, మరో ఓపెనర్‌ యశస్వి జైశ్వాల్‌ 162 పరుగులతో చెలరేగగా.. వన్‌డౌన్‌లో వచ్చిన టీమిండియా టీ20 స్పెషలిస్టు సూర్యకుమార్‌ యాదవ్‌ 80 బంతుల్లోనే 90 పరుగులు సాధించాడు.

సూర్య అవుటైన తర్వాత రెండో రోజు ఆటలో భాగంగా యశస్వి, సర్ఫరాజ్‌(నాటౌట్‌)తో కలిసి రహానే భారీ భాగస్వామ్యాలు నమోదు చేశాడు. ఈ క్రమంలో బుధవారం 204 పరుగుల వద్ద త్యాగరాజన్‌ బౌలింగ్‌లో రహానే అవుటయ్యాడు. 

భారీ స్కోరు
ఇక యశస్వి సెంచరీ, రహానే ద్విశతకానికి తోడు సర్ఫరాజ్‌ ఖాన్‌ సెంచరీతో కదం తొక్కుతుండటంతో రెండో రోజు రెండో సెషన్‌లో 124 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి ముంబై 636 పరుగుల భారీ స్కోరు చేసింది. 

టీమిండియాలో చోటు ఖాయం!
కాగా ఈ ఏడాది దేశవాళీ క్రికెట్‌లో రహానేకు ఇది రెండో డబుల్‌ సెంచరీ కావడం విశేషం. సెప్టెంబరులో దులీప్‌ ట్రోఫీలో భాగంగా వెస్ట్‌జోన్‌ తరఫున బరిలోకి దిగిన రహానే.. నార్త్‌ జోన్‌తో మ్యాచ్‌లో 207 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో టీమిండియాలో పునరాగమనం కోసం ఎదురు చూస్తున్న రహానే ఈ మేరకు అద్భుతంగా రాణించడం పట్ల అతడి ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇలాగే టోర్నీ ఆసాంతం మెరుగైన ప్రదర్శన కనబరిస్తే పుజారా మాదిరి ఈ మాజీ వైస్‌ కెప్టెన్‌ కూడా ప్రధాన జట్టులో చోటు దక్కించుకోవడం ఖాయమంటున్నారు. కాగా రహానే చివరిసారిగా దక్షిణాఫ్రికా టూర్‌లో టీమిండియా తరఫున ఆడాడు.

చదవండి: Babar Azam: ఒక్క మాటతో రమీజ్‌ రాజా నోరు మూయించిన బాబర్‌! అది సాధ్యం కాదు.. ప్రతి వాడూ..

మరిన్ని వార్తలు