Raj Kundra Arrest: వైరల్‌ అవుతున్న రహానే పాత ట్వీట్‌

22 Jul, 2021 10:00 IST|Sakshi

ముంబై: ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌ కుంద్రా ఫోర్నోగ్రఫీకి సంబంధించిన కేసులో అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్‌ కుంద్రా ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉ‍న్నాడు. ఇదిలా ఉంటే టీమిండియా క్రికెటర్‌ అజింక్యా రహానేను రాజ్‌ కుంద్రా వ్యవహారం చిక్కుల్లో పడేలా చేసింది. విషయంలోకి వెళితే.. 9 ఏళ్ల కిత్రం 2012లో రహానే రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాడిగా ఉన్నప్పుడు రాజ్‌ కుంద్రాను మెచ్చుకుంటూ చేసిన ఒక పాత ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది.

''రాజ్‌ కుంద్రా మీరు చాలా గ్రేట్‌ జాబ్‌ చేస్తున్నారు.. ఇలాగే కొనసాగించండి.'' అంటూ పేర్కొన్నాడు. అప్పటికి రాజస్తాన్‌ రాయల్స్‌ సహ యజమానిగా ఉన్న కుంద్రా రహానే ట్వీట్‌కు బదులిచ్చాడు. '' థ్యాంక్యూ సో మచ్‌ రహానే.. నేను చేసే పనిని నువ్వు కచ్చితంగా లైవ్‌లో చూడాలి'' అంటూ సమాధానం ఇచ్చాడు. దానికి రహానే కూడా.. '' తప్పకుండా వస్తాను సార్‌'' అంటూ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం అభిమానులు రహానే, రాజ్‌ కుంద్రాల మధ్య జరిగిన ట్వీట్‌ సంభాషణలను మరోసారి పోస్ట్‌ చేశారు. అయితే ఒక క్రికెటర్‌గా ఇప్పటివరకు ఎలాంటి వివాదాలు ఎదుర్కోని రహానేకు రాజ్‌ కుంద్రాకు చేసిన ట్వీట్లు చిక్కుల్లో పడేశాయి. అయితే రహానే, రాజ్‌కుంద్రాల మధ్య జరిగిన సంభాషణ గురించి సరైన సమాచారం లేకపోయినా.. ఫోర్నోగ్రఫీ కేసులో రాజ్‌ కుంద్రా అరెస్ట్‌ కావడంతో బహుశా వీరి మధ్య ఇలాంటి చర్చ జరిగినట్లు నెటిజన్లు కామెంట్స్‌ చేశారు. రహానే అలాంటివి చేయడని.. వేరే విషయంపై రాజ్‌ కుంద్రాను అభినందించినట్లు మరికొందరు కామెంట్‌ చేశారు. కాగా 2013లో స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న రాజ్‌ కుంద్రా 2015లో రాజస్తాన్‌ రాయల్స్‌తో పాటు క్రికెట్‌ నుంచి జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్నాడు. కాగా రహానే ప్రస్తుతం ఐదు టెస్టుల సిరీస్‌ ఆడేందుకు ఇంగ్లండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.

ఇక బాలీవుడ్‌లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న మోడల్స్‌ను టార్గెట్‌గా చేసుకుని వారిని పోర్న్‌ వీడియోలలో నటించమని బలవంతం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వీడియోలను కొన్ని యాప్‌లలో అప్‌లోడ్‌ చేశారని నిర్ధారిస్తూ ఈ మేరకు ఆధారాలు కూడా సంపాదించారు. ఇప్పటివరకు ఈ కేసులో రాజ్‌కుంద్రాతో కలిపి 11 మందిని అరెస్టు చేయడంతోపాటు 7.5 కోట్ల రూపాయలను సీజ్‌ చేశారు. అతడి మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఈ నెల 23 వరకు రాజ్‌ కుంద్రాను పోలీస్‌ కస్టడీలో ఉంచనున్నారు.

>
మరిన్ని వార్తలు