అప్పుడు పంత్‌ నిరాశకు లోనయ్యాడు: రహానే

26 Jan, 2021 13:04 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా జట్టును వారి సొంత గడ్డపై మట్టికరిపించి బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీని నిలబెట్టుకుంది టీమిండియా. రెగ్యులర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి స్వదేశానికి తిరిగి వచ్చిన తరుణంలో కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన అజింక్య రహానే సారథిగా తనను తాను మరోసారి నిరూపించుకునేందుకు ఈ సిరీస్‌ ఉపయోగపడింది. పింక్‌ బాల్‌ టెస్టులో కోహ్లి సేన ఘోర ఓటమి తర్వాత తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. 36 పరుగులకే ఆలౌట్‌ అయి అపఖ్యాతి మూటగట్టుకున్న జట్టులో ఆత్మవిశ్వాసం నింపిన రహానే.. యువ ఆటగాళ్లతోనే సిరీస్‌ నెగ్గి సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో ఆసీస్‌ టెస్టు సిరీస్‌లో అవలంబించిన వ్యూహాలను తాజాగా ఓ జాతీయ మీడియాతో పంచుకున్నాడు రహానే.

‘‘అడిలైడ్‌ టెస్టు తర్వాత మేమంతా కూర్చుని చర్చించుకున్నాం. ముందురోజు ఏం జరిగిందన్న విషయం గురించి మాట్లాడదలచుకోలేదు. ఎందుకంటే ఊరికే అదే తలచుకుంటే కచ్చితంగా ఒత్తిడిలో కూరుకుపోతాం. సమిష్టిగా ఉండాలి.. పరస్పర సహకారంతో ముందుకు సాగాలి... సానుకూల దృక్పథం అలవరచుకోవాలి.. క్రీడాస్ఫూర్తితో ముందుకు పోవాలి.. మేం అవలంబించిన వ్యూహం ఇదే. ఫలితం ఏదైనా కానివ్వండి.. యువ ఆటగాళ్లకు అండగా నిలబడాలి, వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించగలగాలనుకున్నాం’’ అని రహానే పేర్కొన్నాడు. ఇక ఆసీస్‌ ప్రేక్షకుల విపరీత చేష్టల గురించి.. వర్ణ వివక్ష వ్యాఖ్యలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నాడు.(చదవండి: పంత్‌ వాళ్ల స్థానాన్ని భర్తీ చేస్తాడు: బ్రాడ్‌ హాగ్‌)

పంత్‌ నిరాశ చెందాడు
ఇక తన అద్భుతమై ఇన్నింగ్స్‌తో బ్రిస్బేన్‌ టెస్టు విజయంలో కీలక పాత్ర పోషించిన రిషభ్‌ పంత్‌ గురించి రహానే మాట్లాడుతూ... ‘‘ఎలా ఆడాలన్న విషయం గురించి తనకు బాగా తెలుసు. సిడ్నీ స్ట్రాటజీనే ఇక్కడ కూడా అవలంబించాడు. అయితే 97 పరుగుల వద్ద అవుట్‌ కావడంతో అతడు నిరాశ చెందాడు. కానీ వెంటనే తేరుకుని బ్రిస్బేన్‌లో అదే తరహా ఇన్నింగ్స్‌ ఆడాడు. తన ఆట ఎలా ఉంటుందో చూపించాడు. గతంలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లో సెంచరీలు చేసిన పంత్‌.. మరోసారి తనను తాను నిరూపించుకున్నాడు. ఒక్కసారి క్రీజులో నిలదొక్కుకుంటే ప్రత్యర్థి జట్టు చేతిలో ఉన్న మ్యాచ్‌ను అయినా సరే ఒంటిచేత్తో మనవైపు లాక్కొస్తాడు.

అదీ అతడి సత్తా. తను ఫాం కొనసాగిస్తే ఎంతో బాగుంటుంది’’ అని రహానే ప్రశంసలు కురిపించాడు. సిడ్నీ టెస్టులో రిషభ్‌ పంత్‌ 97 పరుగులు చేసిన విషయం తెలిసిందే. తృటిలో సెంచరీ చేజార్చుకున్నా.. ఒత్తిడి అధిగమించి జట్టు మ్యాచ్‌ను డ్రాగా ముగించడంలో కీలక పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్నాడు. అదే విధంగా నాలుగో టెస్టులో 89 పరుగులతో అజేయంగా నిలిచి, అద్భుత ఇన్నింగ్స్‌తో ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్’‌గా నిలిచాడు.

>
మరిన్ని వార్తలు