చారిత్రక విజయం: రహానే భావోద్వేగం

19 Jan, 2021 18:31 IST|Sakshi

కన్నీళ్లు ఆగడం లేదు: రవిశాస్త్రి

అసలేం జరిగిందో అర్థం కావడం లేదు: రహానే

బ్రిస్బేన్‌: ‘‘ఓవైపు కోవిడ్‌-19 భయాలు, మరోవైపు వరుసగా ఆటగాళ్లు గాయాల బారిన పడటం.. 36 పరుగులకే ఆలౌట్‌ కావడం వంటి అనూహ్య పరిణామాలు.. ఇలాంటి పరిస్థితుల్లో జట్టు పట్టుదలతో ముందుకు సాగింది. అద్భుత ప్రదర్శన కనబరిచింది. నిజానికి నేను సాధారణంగా ఎమోషనల్‌ కాను. కానీ ఇప్పుడు నిజంగానే నా కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఎందుకంటే ఈ విజయం అసాధారణం.

జట్టు చరిత్రలోనే ఈ సిరీస్‌ ఒక మరుపురాని జ్ఞాపకంగా మిగిలిపోతుంది’’ అంటూ టీమిండియా ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి ఉద్వేగానికి లోనయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్టులో భారత జట్టు అద్భుత ప్రదర్శనపై ప్రశంసలు కురిపించాడు. కాగా బ్రిస్బేన్‌లో జరిగిన ఆఖరి టెస్టులో టీమిండియా 3 వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. తద్వారా గబ్బా స్టేడియంలో ఆసీస్‌కు 32 ఏళ్ల తర్వాత ఓటమి రుచి చూపించి, బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీని నిలబెట్టుకుంది.(చదవండి: ఆసీస్‌ టూర్‌: అరంగేట్రంలోనే అదరగొట్టేశారు!)

రహానే భావోద్వేగం..
టీమిండియా చారిత్రాత్మక విజయంపై కెప్టెన్‌ అజింక్య రహానే స్పందించాడు. ‘‘ అసలేం జరిగిందో నాకు అర్థం కావడం లేదు. ఈ సిరీస్‌ విజయాన్ని అభివర్ణించేందుకు మాటలు రావడం లేదు. చాలా ఎమోషనల్‌ అయిపోయాను. అడిలైడ్‌ టెస్టు పరాజయం తర్వాత ప్రతీ ఒక్క ఆటగాడు పట్టుదలతో ఆడాడు. ఈ గెలుపులో ప్రతీ ఆటగాడికి భాగస్వామ్యం ఉంది. ముఖ్యంగా రిషభ్‌, నట్టు(నటరాజన్‌), శార్దూల్‌ ఠాకూర్‌, వాషింగ్టన్‌ సుందర్‌ బంతితో, బ్యాట్‌తో మ్యాజిక్‌ చేశారు. ఛతేశ్వర్‌ పుజారా మంచి ప్రదర్శన కనబరిచాడు. అశ్విన్‌ ఈ సిరీస్‌లో అద్భుతంగా రాణించాడు. మూడో టెస్టులో దురదృష్టవశాత్తూ గాయపడ్డాడు గానీ తను బాగా ఆడాడు. ఎందుకో అర్థం కావడంలేదు. కానీ నిజంగా నేను చాలా ఎమోషనల్‌ అయిపోతున్నాను’’ అంటూ రహానే భావోద్వేగానికి లోనయ్యాడు. (చదవండి: 36 పరుగులకు ఆలౌట్‌.. కానీ ఇప్పుడు)

అదే విధంగా.. జట్టు సమిష్టి కృషి వల్లే అపూర్వ విజయం సొంతమైందని హర్షం వ్యక్తం చేశాడు. కాగా పింక్‌బాల్‌ టెస్టులో ఘోర ఓటమి తర్వాత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి పితృత్వ సెలవుపై భారత్‌కు తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. అతడి గైర్హాజరీలో రహానే కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు. వరుసగా సీనియర్‌ ఆటగాళ్లు గాయాల బారిన పడినప్పటికీ ఒత్తిడిని జయిస్తూ, యువ ఆటగాళ్లపై నమ్మకం ఉంచి జట్టును ముందుండి నడిపించాడు.

ఇక బాక్సింగ్‌ డే టెస్టులో విజయం సాధించిన రహానే సేన, సిడ్నీ టెస్టును డ్రాగా ముగించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సిరీస్‌లో బౌలింగ్‌ విభాగంలో సిరాజ్‌(13 వికెట్లు), అశ్విన్‌(12) జడేజా(7), శార్దూల్‌ ఠాకూర్‌(7), బుమ్రా(11), ఉమేశ్‌ యాదవ్‌(4) రాణించగా.. బ్యాట్స్‌మెన్‌ రిషభ్‌ పంత్‌(274), శుభ్‌మన్‌ గిల్‌(259), పుజారా(271), రోహిత్‌ శర్మ(129), రహానే(268) అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.

Poll
Loading...
Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు