ఆస్ట్రేలియన్లను మైండ్‌గేమ్‌ ఆడనివ్వండి: రహానే

25 Dec, 2020 19:21 IST|Sakshi

సిడ్నీ: ఆసీస్‌ క్రికెటర్లు మైండ్‌ గేమ్‌ ఆడటంలో దిట్ట అని, అయితే వారి ఆటలు తన ముందు సాగవని టీమిండియా కెప్టెన్‌(తాత్కాలిక) అజింక్య రహానే అన్నాడు. మ్యాచ్‌పై దృష్టి సారించి సమిష్టిగా రాణించేలా జట్టును ముందుండి నడిపించడమే తన ముందున్న లక్ష్యమని పేర్కొన్నాడు. కాగా పింక్‌బాల్‌ టెస్టులో కోహ్లి ఓటమి పాలైన విషయం తెలిసిందే. కేవలం 36 పరుగులకే రెండో ఇన్నింగ్స్‌ ముగించి చెత్త రికార్డును నమోదు చేసి.. 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయం మూటగట్టుకుంది. దీంతో సహజంగానే భారత జట్టుపై విమర్శలు వెల్లువెత్తాయి. 

ఈ నేపథ్యంలో ఆసీస్‌ ప్రధాన కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ మాట్లాడుతూ.. తొలి టెస్టులో ఓటమితో టీమిండియా ఒత్తిడిలో కూరుకుపోయిందని, ఇప్పుడు కెప్టెన్‌ రహానేపై ఒత్తిడి తెచ్చే విధంగా తాము ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నాడు. ఈ విషయంపై స్పందించిన రహానే.. ‘‘ఆస్ట్రేలియన్లు చాలా బాగా మైండ్‌ గేమ్‌ ఆడతారు. ఆడనివ్వండి. కానీ మేం ఆటపై దృష్టి సారిస్తాం. జట్టుగా, పరస్పరం ప్రతి ఒక్కరం సహకరించుకుంటూ ముందుకు సాగుతాం. నిజానికి కెప్టెన్సీ బాధ్యతలు దక్కడం నాకు గర్వకారణం. నాకు దక్కిన గొప్ప అదృష్టం. ఆ బాధ్యతను సక్రమంగా నెరవేర్చేందుకు శాయశక్తులా కృషి చేస్తా. ఎలాంటి ఒత్తిడికి గురికాను. నా జట్టుకు నేను అండగా ఉంటా. వాళ్లు టీం మొత్తాన్ని టార్గెట్‌ చేస్తారు. కాబట్టి అన్ని విధాల ప్రత్యర్థి జట్టును ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్నాం’’ అని చెప్పుకొచ్చాడు. (చదవండి: కోహ్లిని క్షమాపణ కోరాను: రహానే)

ఇక స్వదేశానికి వెళ్లేముందు కోహ్లి తమతో మాట్లాడిన విషయాన్ని గుర్తుచేసుకున్న రహానే.. ‘‘భారత్‌ వెళ్లేముందు అడిలైడ్‌లో కోహ్లితో కలిసి డిన్నర్‌ చేశాం. తను మా అందరితో చర్చించాడు. ఒకరికి ఒకరు అండగా ఉంటూ, జట్టుగా రాణిస్తూ, ప్రతీ క్షణాన్ని ఎలా ఆస్వాదించాలో చెప్పాడు. ఒక ఆటగాడి విజయం మైదానం లోపల, వెలుపల జట్టుకు ఎలా ఉపయోగపడుతుందో వివరించాడు’’ అని పేర్కొన్నాడు. కాగా బాక్సింగ్‌ డే టెస్టులో ఎలాగైనా సత్తా చాటాలని టీమిండియా నెట్స్‌లో కఠోరంగా శ్రమిస్తోంది. మరోవైపు.. పితృత్వ సెలవుపై విరాట్‌ కోహ్లి భారత్‌కు తిరిగి రానుండగా, గాయంతో షమీ జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే.(చదవండి: ఆ స్థానంలో నన్ను ఊహించుకోలేను: ఆసీస్‌ కోచ్‌)

>
మరిన్ని వార్తలు