#Akash Madhwal: ఆర్సీబీలో నెట్‌బౌలర్‌గా ఉన్నా... ఒక్క ఛాన్స్‌ కూడా ఇవ్వలేదు! కానీ ఇప్పుడు.. తను అండగా నిలబడి..

25 May, 2023 16:47 IST|Sakshi
ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ముంబైని గెలిపించిన ఆకాశ్‌ మధ్వాల్‌ (PC: IPL)

IPL 2023 LSG Vs MI- Akash Madhwal: ‘‘2019లో ఆర్సీబీలో నెట్‌ బౌలర్‌గా చేరాను. అక్కడ నాకు ఆడే అవకాశం రాలేదు. తర్వాత ముంబై ఇండియన్స్‌కు మారాను. ఇక్కడ నాకు అనేక ఛాన్స్‌లు ఇచ్చారు’’ అని ముంబై బౌలర్‌ ఆకాశ్‌ మధ్వాల్‌ అన్నాడు. ఎంఐ యాజమాన్యం తనకు పూర్తి మద్దతుగా నిలిచిందని పేర్కొన్నాడు.

ఆర్సీబీ వదులుకుంది
కాగా ఉత్తరాఖండ్‌కు చెందిన రైట్‌ ఆర్మ్‌ పేసర్‌ ఆకాశ్‌ను ఆర్సీబీ 2021లో కొనుగోలు చేసింది. కానీ అతడికి ఒక్క మ్యాచ్‌ కూడా ఆడే అవకాశం రాలేదు. ఈ క్రమంలో 2022 వేలంలో ఆకాశ్‌ మధ్వాల్‌ తన పేరు నమోదు చేసుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఒక్క ఫ్రాంఛైజీ కూడా అతడిపై ఆసక్తి చూపకపోవడంతో అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు.

ముంబై అవకాశమిచ్చింది
ఈ నేపథ్యంలో ఐపీఎల్‌-2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ రూపంలో అదృష్టం అతడి తలుపు తట్టింది. సూర్యకుమార్‌ యాదవ్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన అతడికి ఆ ఎడిషన్‌లో అవకాశం ఇవ్వకపోయినప్పటికీ.. మినీ వేలం-2023కి ముందు 20 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది ముంబై.

ఈ క్రమంలో ఐపీఎల్‌-2023లో పంజాబ్‌ కింగ్స్‌తో మొహాలీలో జరిగిన మ్యాచ్‌ సందర్భంగా ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు ఆకాశ్‌ మధ్వాల్‌. తొలి మ్యాచ్‌లో 3 ఓవర్లు బౌలింగ్‌ చేసి 37 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక సీజన్‌లో ఇప్పటి వరకు మొత్తంగా 7 మ్యాచ్‌లు ఆడే అవకాశం దక్కించుకున్న అతడు మొత్తంగా 13 వికెట్లు పడగొట్టాడు.
.
PC: IPL Twitter

అత్యుత్తమ గణాంకాలతో రికార్డులు
ముఖ్యంగా ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ను ఓడించడంలో కీలక పాత్ర పోషించి ‘ముంబై హీరో’గా అవతరించాడు. చెన్నైలో బుధవారం నాటి మ్యాచ్‌లో 3.3 ఓవర్లలో కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీసి అత్యుత్తమ గణాంకాలతో రికార్డులు సృష్టించాడు. ఈ నేపథ్యంలో ముంబై క్వాలిఫయర్‌-2కు అర్హత సాధించడంలో కీలకంగా మారిన ఆకాశ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

నా బలం అదే.. రోహిత్‌ భయ్యా అండగా నిలబడ్డాడు
ఇక అద్భుత స్పెల్‌తో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా అనంతరం ఆకాశ్‌ మధ్వాల్‌ మాట్లాడుతూ.. ముంబైకి ఆడటం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. సారథి రోహిత్‌ శర్మకు తన సేవలు ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో తెలుసు కాబట్టే లక్నోతో మ్యాచ్‌లో అనుకున్న ఫలితం రాబట్టామని పేర్కొన్నాడు.

‘‘యార్కర్లు వేయడం నా బలం. ఈ విషయం గురించి రోహిత్‌ భాయ్‌కు బాగా తెలుసు. కెప్టెన్‌గా జట్టుకు నా సేవలు ఎప్పుడు అవసరమో కూడా తనకు బాగా తెలుసు. నెట్స్‌లో కూడా నేను కొత్త బంతితో ప్రాక్టీసు చేసేవాడిని.

ప్రాక్టీస్‌ మ్యాచ్‌లలో కొత్త బంతితో బౌలింగ్‌ చేసి అనేక సార్లు వికెట్లు తీశాను. అలా నాలో ఆత్మవిశ్వాసం క్రమక్రమంగా పెరిగింది. రోహిత్‌ భాయ్‌ నాకు ప్రతిసారి న్యూ బాల్‌నే అందించేవాడు. భయ్యా నమ్మకాన్ని నేను నిలబెట్టుకున్నాను.

పూరన్‌ వికెట్‌ తీయడంలో మజా వచ్చింది
నన్ను నేను నిరూపించుకున్నందుకు చాలా సంతోషంగా, మనసు తేలికగా ఉంది. రోహిత్‌ నాకు అన్ని విధాలా అండగా నిలబడ్డాడు’’ అని ఆకాశ్‌ మధ్వాల్‌.. ముంబై ఇండియన్స్‌ సారథి రోహిత్‌ శర్మ పట్ల కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. ఇక ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో లక్నో బ్యాటర్‌ నికోలస్‌ పూరన్‌ వికెట్‌ తీయడం తనకెంతో సంతోషాన్నిచ్చిందని ఆకాశ్‌ పేర్కొన్నాడు.

కీలక వికెట్లు పడగొట్టి..
కాగా లక్నోతో మ్యాచ్‌లో ఆకాశ్‌ మధ్వాల్‌.. ఓపెనర్‌ ప్రేరక్‌ మన్కడ్‌(3), ఆయుష్‌ బదోని(1), నికోలస్‌ పూరన్‌ (0) రూపంలో మూడు కీలక వికెట్లు తీయడంతో పాటు.. రవి బిష్ణోయి (3), మొహ్సిన్‌ ఖాన్‌(0)లను పెవిలియన్‌కు పంపాడు.

డేంజరస్‌ బ్యాటర్‌ పూరన్‌ను ఆకాశ్‌ డకౌట్‌ చేయడంతో మ్యాచ్‌ ముంబైకి ఫేవర్‌గా మారింది. 81 పరుగుల తేడాతో గెలుపొంది క్వాలిఫయర్‌-2కి రోహిత్‌ సేన అర్హత సాధించింది. తదుపరి మే 26న అహ్మాదాబాద్‌లో గుజరాత్‌ టైటాన్స్‌తో ముంబై తలపడనుంది.  

చదవండి: అతడు రీ ఎంట్రీ ఇస్తే సంతోషిస్తా! టీమిండియా గెలవాలని కోరుకుంటున్నా.. కానీ: దాదా
'వరల్డ్‌కప్‌ ఉంది.. ఇలాంటి రిస్క్‌లు వద్దు!'

మరిన్ని వార్తలు