#AkashMadhwal: జాఫర్‌కు దొరికిన ఆణిముత్యం.. ముంబై ట్రంప్‌కార్డ్‌;  భలే దొరికాడు

25 May, 2023 10:06 IST|Sakshi
Photo: IPL Twitter

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ ఫైనల్‌కు వెళ్లే దారిలో ఎలిమినేటర్‌ను క్లియర్‌ చేసి క్వాలిఫయర్‌-2కు చేరుకుంది. మే 26(శుక్రవారం) గుజరాత్‌ టైటాన్స్‌తో క్వాలిఫయర్‌-2లో తలపడనుంది. ఆ మ్యాచ్‌లోనూ గెలిచి ఫైనల్లో సీఎస్‌కేను చిత్తు చేసి ఆరోసారి ఛాంపియన్‌గా నిలవాలని ఉవ్విళ్లూరుతుంది. 

ఇక బుధవారం లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ముంబై గెలుపుకు ప్రధాన కారణం ఆకాశ్‌ మధ్వాల్‌. తన సంచలన బౌలింగ్‌తో కేవలం ఐదు పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. రూ.20 లక్షల కనీస ధరకు మాత్రమే ముంబై ఇండియన్స్‌ కొనుగోలు చేసింది. అయితే ఆకాశ్‌ మధ్వాల్‌ను ముంబై తమ ట్రంప్‌కార్డ్‌గా భలే ఉపయోగించుకుంది.

అంతకముందు లీగ్‌ దశలోనూ ప్లేఆఫ్‌ చేరాలంటే ఎస్‌ఆర్‌హెచ్‌పై కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లనూ ఆకాశ్‌ నాలుగు వికెట్లతో మెరిశాడు. మొత్తంగా ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ తరపున ఏడు మ్యాచ్‌లాడిన ఆకాశ్‌ మధ్వాల్‌ 13 వికెట్లు తీశాడు. యార్కర్ల కింగ్‌ బుమ్రా లేని లోటును మధ్వాల్‌ తీరుస్తూ రోహిత్‌కు అత్యంత నమ్మకమైన బౌలర్‌గా ఎదిగాడు.


Photo: IPL Twitter

ఎలిమినేటర్‌ లాంటి కీలక మ్యాచ్‌లో సత్తా చాటిన మధ్వాల్ గురించి తెలుసుకోవడానికి క్రికెట్ అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆకాశ్ మధ్వాల్ గురించి ఆసక్తికర విశేషాలు మీకోసం..

జాఫర్‌ వెలికితీసిన ఆణిముత్యం..
ఆకాశ్ 24 ఏళ్ల వయసు వచ్చే వరకూ టెన్నిస్ బాల్ క్రికెట్ మాత్రమే ఆడటం విశేషం. అతడు ఈ స్థాయికి చేరుకోవడానికి టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కారణం. 2019లో ఉత్తరాఖండ్ తరఫున ఆడుతున్న సమయంలో మధ్వాల్ ప్రతిభను జాఫరే గుర్తించాడు. యూపీ తరఫున ఆకట్టుకునే ప్రదర్శన చేసిన మధ్వాల్.. 2022-23 దేశవాళీ సీజన్లో తమ రాష్ట్ర జట్టుకు కెప్టెన్ గానూ ఎంపికయ్యాడు.


Photo: IPL Twitter

ఇంజనీర్‌ నుంచి క్రికెటర్‌గా.. పంత్‌ పొరుగింట్లో నివాసం
1993 నవంబర్ 23న ఉత్తరాఖండ్‌లోని రూర్కీలోని జన్మించిన ఆకాశ్ మధ్వాల్ ఇంజినీరింగ్ చదివాడు. అంతే కాదు టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్‌ పొరుగింట్లోనే అతడు నివసిస్తుండటం విశేషం. వీరిద్దరూ అవతార్ సింగ్ అనే కోచ్ దగ్గరే శిక్షణ పొందారు. 2019-20 సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో కోసం.. ఆకాశ్ ఉత్తరాఖండ్ జట్టుకు ఎంపికయ్యాడు. 2019 డిసెంబర్ 25న తొలి రంజీ మ్యాచ్ ఆడాడు.


Photo: IPL Twitter

ఆర్‌సీబీ వదిలేసింది.. ముంబై ఒడిసిపట్టింది
2021లోనే ఆకాశ్ ఐపీఎల్‌కు ఎంపికయ్యాడు. ఆర్సీబీ అతన్ని వేలంలో కొనుగోలు చేసినప్పటికీ.. ఆ సీజన్లో ఆడే అవకాశం లభించలేదు. 2022లో అతడు అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. 2022 సీజన్లోనే సూర్యకుమార్ యాదవ్‌కు రీప్లేస్‌మెంట్‌గా ముంబై ఇండియన్స్ జట్టులో చేరాడు. ఐపీఎల్ 2023కి ముందు నిర్వహించిన వేలంలో రూ.20 లక్షలకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది.


Photo: IPL Twitter

ఈ సీజన్లో ఇప్పటి వరకూ 7 మ్యాచ్‌లు ఆడిన మధ్వాల్ 13 వికెట్లు తీశాడు. 2021 సీజన్లోనే ఆర్సీబీ ఆకాశ్‌కు అవకాశం ఇచ్చి ఉండుంటే.. ఆ జట్టులో అతడు బుమ్రాలా ఎదిగేవాడు. కానీ బెంగళూరు అవకాశం ఇవ్వకుండా అతన్ని వదిలేసుకోగా.. ముంబై మాత్రం ఆకాశ్‌ను ఆడించి ప్రయోజనం పొందింది.

చదవండి: #DeepakHooda: ఎవరి కర్మకు వారే బాధ్యులు!

పరుగుపై పెట్టాల్సిన దృష్టి బంతిపై.. తగిన మూల్యం

మరిన్ని వార్తలు :


Advertisement

ASBL
మరిన్ని వార్తలు