-

Shoaib Akhtar: అందం ఒక్కటే సరిపోదు.. తెలివి కూడా ఏడిస్తే బాగుండు!

15 Feb, 2023 15:58 IST|Sakshi

పాకిస్తాన్‌ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ ప్రస్తుతం ఓటీటీ యాంకర్‌గా మారిపోయాడు. 'షోయబ్‌ అక్తర్‌ షో' పేరిట ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌.. ఉర్ఫూప్లిక్స్‌(UrfuFlix)లో కొత్త ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన అక్తర్‌ తానే స్వయంగా హోస్ట్‌ చేస్తున్నాడు. తాజాగా తన షోకు నిదా యాసిర్‌ అనే మహిళా సెలబ్రిటీని అతిథిగా ఆహ్వానించాడు. నిదా యాసిర్‌ను టీజ్‌ చేద్దామని భావించిన అక్తర్‌ ఒక సింపుల్‌ ప్రశ్నను అడిగాడు. అయితే అతిథిని కన్ఫూజ్‌ చేసేందుకు కొంచెం తికమకగా అడిగాడు.

'1992 వరల్డ్‌కప్‌ను పాకిస్తాన్‌ ఏ సంవత్సరంలో గెలిచింది' అంటూ అడిగాడు. నిజానికి ప్రశ్నలోనే జవాబు ఉంది. ఆ విషయాన్ని పసిగట్టని నిదా యాసిర్‌ కన్ఫూజన్‌కు గురైంది. తనతో పాటు వచ్చిన రెండో గెస్ట్‌ను సహాయం కూడా కోరింది. అయితే చివరకు '2006' అంటూ తప్పుడు సమాధానం చెప్పింది. నిదా యాసిర్‌ సమాధానం విన్న అక్తర్‌ తనలో తానే నవ్వుకుంటూ ఈసారి ప్రశ్నను మరో రూపంలో అడిగాడు.

'2009 టి20 వరల్డ్‌కప్‌ను పాకిస్తాన్‌ ఏ సంవత్సరంలో గెలుచుకుంది' అంటూ ప్రశ్న వేశాడు. ఈసారి ప్రశ్న మారిందన్న కనీస అవగాహన లేకుండా '1992' అంటూ నిదా యాసిర్‌ టక్కున చెప్పేసింది. దీంతో​ అక్తర్‌తో పాటు షో చూడడానికి వచ్చిన ప్రేక్షకులు కూడా నిదా యాసిర్‌ తెలివికి నవ్వాలో.. ఏడ్వాలో అర్థం కాలేదు.దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

సోషల్‌ మీడియాలో మాత్రం ఈ అమ్మడు ట్రోల్స్‌ బారిన పడిపోయింది. ''ప్రశ్నలోనే జవాబున్నా కనుక్కోలేకపోయావు.. నీ తెలివికి జోహార్లు''.. ''అందం ఒక్కటే ఉంటే సరిపోదు.. కాస్త తెలివి కూడా ఏడిస్తే బాగుండు'' అంటూ కామెంట్స్‌ చేశారు. కాగా ఇదే ఫ్లాట్‌ఫామ్‌లో క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌, సానియా మీర్జాలు కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న మాలిక్‌ మీర్జా షోకు పోటీగా అక్తర్‌ తన షోను నిర్వహిస్తున్నాడు.

చదవండి: టెస్టుల్లోనూ నెంబర్‌వన్‌.. కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ కొత్త చరిత్ర 

మరిన్ని వార్తలు