Virat Kohli: ఓర్వలేనితనం అంటే ఇదే.. 

18 Jan, 2023 13:20 IST|Sakshi

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌.. కింగ్‌ కోహ్లి ప్రస్తుతం సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. మూడు వారాల వ్యవధిలో మూడు వన్డే సెంచరీలు బాది వింటేజ్‌ కోహ్లిని తలపిస్తున్నాడు. క్రీజులోకి వస్తే పాతుకుపోవడం లక్ష్యంగా పెట్టుకున్న అతను సెంచరీ సాధించేవరకు ఔట్‌ అవ్వడానికి ఇష్టపడడం లేదు. అసలు ఏడాది కింద కోహ్లి ఆటతీరు ఎలా ఉండేదో అందరికి తెలిసిందే. 71వ సెంచరీ(మూడు ఫార్మాట్లు కలిపి) అందుకోవడం కోసం దాదాపు వెయ్యి రోజులకు పైగా నిరీక్షించిన కోహ్లి ఎట్టకేలకు ఆసియాకప్‌లో అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌ ద్వారా 71వ సెంచరీ అందుకున్నాడు.

అప్పటినుంచి ఇప్పటిదాకా కోహ్లి పరుగుల ప్రవాహం ఎక్కడా ఆగడం లేదు. టి20 ప్రపంచకప్‌లో టీమిండియా తరపున టాప్‌ స్కోరర్‌గా నిలిచిన కోహ్లి.. ఆ మెగాటోర్నీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై ఆడిన ఇన్నింగ్స్‌ ఇప్పటికి కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. ఆ తర్వాత బంగ్లాదేశ్‌ పర్యటనలోనూ అదరగొట్టిన కోహ్లి వన్డేల్లో ఒక సెంచరీ బాదాడు.

ఆ తర్వాత లంకతో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్‌లోనూ కోహ్లి అదే దూకుడు చూపించాడు. మూడు వన్డేలాడిన కోహ్లి రెండు సెంచరీలతో ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచాడు. అంతేగాక తన సెంచరీల సంఖ్యను వన్డేల్లో 46కు.. ఓవరాల్‌గా 74కు పెంచుకున్నాడు. ఇక బుధవారం కివీస్‌తో ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌లో కోహ్లి అదే జోరును చూపిస్తూ మరిన్ని సెంచరీలు చేస్తాడేమో వేచి చూడాలి.

అయితే కోహ్లి ఫామ్‌ను తట్టుకోలేని ఒక పాక్‌ జర్నలిస్టు తన అక్కసు వెళ్లగక్కాడు. ''ఒత్తిడి తక్కువగా ఉన్న సమయంలోనే కోహ్లి సెంచరీలు సాధిస్తాడు. ప్రెషర్‌ ఉన్న సమయంలో కోహ్లి బ్యాట్‌ నుంచి పరుగులు రావు.. ఇదేమంత గొప్ప విషయం కాదు.. ఎలాంటి ఒత్తిడి లేని సమయంలో గొప్పగా బ్యాటింగ్‌ చేయడం ఏ బ్యాటర్‌కైనా సాధ్యమే. ఆస్ట్రేలియాతో త్వరలో జరగనున్న టెస్టు సిరీస్‌కు కోహ్లిని సిద్దం చేయాలి. బలమైన జట్టుపై ఎలా బ్యాటింగ్‌ చేస్తాడనేది ఆసక్తికరంగా ఉంటుంది.'' అంటూ తన అక్కసు చూపించాడు. 

అయితే సదరు పాక్‌ జర్నలిస్టుపై టీమిండియా ఫ్యాన్స్‌ మాత్రమే కాదు.. సొంతదేశ అభిమానులే ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌ క్రికెట్‌ షోయబ్‌ మక్సూద్‌ తనదైన శైలిలో పాక్‌ జర్నలిస్ట్‌కు కౌంటర్‌ ఇచ్చాడు. ''ఒత్తిడి లేనప్పుడు మాత్రమే కోహ్లి బెస్ట్‌ అంటున్నావా.. అతని ఆటేంటో ప్రపంచానికి మొత్తం తెలుసు.. కాస్త ఎదుగు భయ్యా'' అంటూ ట్రోల్‌ చేశాడు. ఇక కొంతమంది అభిమానులు.. ''ఓర్వలేనితనం అంటే ఇదే''.. అంటూ కామెంట్స్‌ చేశారు.

చదవండి: వన్డే ర్యాంకింగ్స్‌లో అదరగొట్టిన విరాట్‌ కోహ్లి.. టాప్‌-5లోకి ఎం‍ట్రీ

ఉప్పల్‌లో మ్యాచ్‌ అంటే కోహ్లికి పూనకాలే!

మరిన్ని వార్తలు